ఖైరతాబాద్, సెప్టెంబర్ 17: నగరంలోని ప్రతిష్టాత్మక నిమ్స్ దవాఖానాలో మీడియాను నిలువరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తర్వాత దవాఖానాలో పరిపాలన విభాగం మొత్తం అస్తవ్యస్తమైనట్లు ఆస్పత్రి వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. పలు విభాగాల్లో అవకతవకలు, అక్రమాలపై తరచూ మీడియాలో కథనాలు వస్తుండటంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వైద్యాధికారులు మీడియాను నిలువరించే చర్యలకు ఉపక్రమించినట్లు కనిపిస్తోంది.
తాజాగా ఓ వైద్యాధికారి నేరుగా మెడికల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే….ఆస్పత్రి అదనపు మెడికల్ సూపరింటెండెంట్ పేరుతో ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు అధికారిక లేఖ అందింది. నిమ్స్ గోప్యతకు భంగం వాటిల్లుతుందని, కొందరు సిబ్బంది మీడియాకు లీకులు ఇస్తున్నారని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, మీడియాపై నిషేదాజ్ఞలు విదించాలన్నది దాని సారాంశం. అయితే ఆ లేఖ సైతం మీడియాకు లీకు కావడంతో దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది.
నిమ్స్ దవాఖాన ప్రభుత్వ సహకారంతో పేద ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలపై పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తున్న స్వయం ప్రతిపత్తి కలిగిన వైద్యశాల. కాగా, అవినీతి అక్రమాలు ఎదుర్కొంటున్న ఓ వైద్యాధికారి భాగోతాలను ఇటీవల మీడియా వెలుగులోకి తెచ్చింది. దీంతో సదరు వైద్యాధికారి ఆస్పత్రిలో జరిగే అవినీతి అక్రమ కోణాలు మీడియాకు తెలియనివ్వకుండా చేయడం కోసమే ఆ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అందులో సొంత వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందిని టార్గెట్ చేసి మీడియాకు లీకులిచ్చేవారిపై కఠిన, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరడం విశేషం. అయితే సదరు అధికారి సూపరింటెండెంట్‌ను ఆదేశించినట్లుగా లేఖ ఉండడంతో చిర్రుబుర్రు లాడినట్లు తెలిసింది.
కాగా, మెడికల్ సూపరింటెండెంట్ ఆ లేఖను తప్పుపట్టినట్లు సమాచారం. సదరు అదనపు అధికారి గోపత్య సమాచారమంటే ఏమిటో ఆ లేఖలో పేర్కొనలేదని, మీడియాకు లీక్ చేసిన సమాచారమేమిటో చెప్పలేదని, అందులో ఉపయోగించిన భాష సైతం ఆక్షేపణీయమని, సరైన ఆధారాలు లేకుండా సిబ్బంది, మీడియాపై నిందనలు వేయడం సరికాదని ఓ వివరణ లేఖను డైరెక్టర్‌కు పంపించినట్లు తెలిసింది.