Black Coffee With Lemon | ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది నిత్యం సేవిస్తున్న పానీయాల్లో కాఫీ మొదటి స్థానంలో ఉంటుంది. విదేశీయులు టీ కన్నా కాఫీని అధికంగా తాగుతారు. అయితే సాధారణ కాఫీ కాకుండా వారు బ్లాక్ కాఫీని ఎక్కువగా సేవిస్తుంటారు. బ్లాక్ కాఫీని సేవిస్తే అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. చక్కెర కలపకుండా కేవలం కాఫీ డికాషన్‌ను మాత్రమే తాగుతారు. దీన్నే బ్లాక్ కాఫీ అంటారు. కొందరు రుచి కోసం ఇందులో తేనె కలుపుకుంటారు. అయితే తేనె మాత్రమే కాదు, ఇందులో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగితే ఇంకా ఎక్కువ లాభం కలుగుతుందని వారు అంటున్నారు. ఇందులో తేనెను కూడా జోడించవచ్చు. దీంతో పోషకాలు, ఔషధ విలువల శాతం మరింత పెరుగుతుంది.
బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి సేవిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. కాఫీ, నిమ్మరసంలో అనేక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మరసంలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో అంతర్గతంగా వచ్చే వాపులు తగ్గిపోతాయి. గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగితే బరువు తగ్గుతారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. ఈ విధంగా తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది కూడా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. నిమ్మరసం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ నుంచి బయట పడవచ్చు. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. బ్లాక్ కాఫీలో కలిపే నిమ్మరసం కారణంగా అందులోని విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి సేవించడం వల్ల అధిక బరువు సమస్యపై మ్యాజిక్ లా పనిచేస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. అయితే ఇది నిజమే అయినప్పటికీ కేవలం బ్లాక్ కాఫీని సేవించడం వల్లే బరువు తగ్గుతామని, వ్యాయామం చేయాల్సిన పనిలేదని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే సరైన డైట్ ను పాటిస్తూ రోజూ బ్లాక్ కాఫీని నిమ్మరసంతో కలిపి సేవిస్తూ వ్యాయామం చేస్తుంటే బరువు త్వరగా తగ్గుతారు. ఫలితం త్వరగా వస్తుంది. ఇక బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలపాలా, వద్దా అని కూడా చాలా మంది సందేహిస్తుంటారు. ఇందులో ఆలోచించాల్సిన పనిలేదు. బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే అసిడిటీ ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగకూడదు. కాఫీ, నిమ్మరసం రెండూ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి కనుక ఈ రెండింటినీ కలిపి తాగితే అసిడిటీ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి సేవించేవారు ఈ జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.