కాన్బెర్రా : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత మహిళా క్రికెట్ జట్టు రెండో మ్యాచ్‌లో పరాభవం పాలైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలిపోరులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రెండో మ్యాచ్ బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సేన.. 19 పరుగుల తేడాతో ప్రత్యర్థి చేతిలో చిత్తైంది. బంతితో ఆసీస్‌ను బాగానే కట్టడిచేసినా ఛేదన చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. కంగారూలు నిర్దేశించిన 164 పరుగుల ఛేదనలో 144/9 వద్దే ఆగిపోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (36), స్మృతి మంధాన (31), షెఫాలీ వర్మ (29) భారత శిబిరంలో గెలుపు ఆశలు రేపారు. రిచా ఘోష్ (19), అమన్‌జ్యోత్ కౌర్ (3) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. ఒకదశలో 16.4 ఓవర్లకు 126/3తో గెలుపు దిశగా సాగిన టీమ్ఇండియా.. పది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి వైపు నిలిచింది.
ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డ్నర్ (3/22) మూడు వికెట్లు తీయగా కిమ్ గార్త్, అన్నాబెల్, కెప్టెన్ మొలినెక్స్ తలా రెండు వికెట్లు తీశారు. అంతకుముందు భారత ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు.. ఓపెనర్లు జార్జియా వాల్ (57 బంతుల్లో 88, 11 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46, 4 ఫోర్లు) శతాధిక భాగస్వామ్యంతో ఆ జట్టు పోరాడగలిగే స్కోరు చేయగల్గింది. ఈ ఇద్దరూ ఔటయ్యాక భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ఆసీస్‌ను భారీ స్కోరు చేయకుండా నిలువరించినా బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి వైపు నిలిచారు. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ20 ఈనెల 21న అడిలైడ్‌లో జరుగుతుంది.