సిటీబ్యూరో: ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో ఉన్న సిటీని మూడుగా విభజించడంపై చట్ట విరుద్ధంగా జరిగిందని, జనగణన సమయంలో పునర్వేవస్థీకరణకు అవకాశం లేకున్నా ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిందంటూ నగరానికి చెందిన ఓ పౌరుడు జీవో. 55ని సవాల్ చేస్తూ హైకోర్టులో పటిషన్ దాఖలు చేయడంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే శివారులో ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలోకి కలపడంపై కోర్టులో కేసు నడుస్తుండగా, తాజాగా జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసిన అంశంపై మరో కేసు ఫైల్ అయ్యింది.
దీంతో పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనపై కూడా ఈ కేసుల ప్రభావం ఎలా ఉండబోతుందనే అనే విషయంపై పోలీసు వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోకి గతంలో రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను కలిపారు. ఇలా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను మరింతగా విస్తరించారు. హైదరాబాద్ నుంచి నార్త్‌జోన్‌లోని పలు పోలీస్స్టేషన్లను రాచకొండ స్థానంలో కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి కమిషనరేట్లోకి కలిపారు.
జీహెచ్ఎంసీని విస్తరించి ఆ తరువాత దానిని మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్లుగా విభజించారు. మున్సిపల్ కార్పొరేషన్ల ఆధారంగానే పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. అయితే ఒక నియోజకవర్గంలోని డివిజన్లు నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోకి వస్తున్నాయి. ఒక నియోజకవర్గంలో ఉండే ప్రజలు అటూ పోలీసు, ఇటూ జీహెచ్ఎంసీ సేవల కోసం మూడు కార్పొరేషన్లు, మూడు కమిషనరేట్ల పరిధిలోని కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది.
తాజాగా హైకోర్టులో జీహెచ్ఎంసీ పునర్విభజనకు సంబంధించిన అంశాన్ని సవాల్ చేస్తూ సామాన్య పౌరులు పిటిషన్లు వేస్తుండడంతో, మున్ముందు కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది? దాని వల్ల పోలీస్ కమిషనరేట్ల విభజనపై ఏ మేర ప్రభావం ఉంటుంది? అనే విషయాలు ఇప్పుడు నాలుగు పోలీస్ కమిషనరేట్ల సిబ్బందిలో చర్చనీయాంశంగా మారాయి.