భీమ్‌గల్, ఫిబ్రవరి 19: మున్సిపల్ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసమే పని చేస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించిన సమావేశం అనంతరం మీడియాతో వేముల మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భీమ్‌గల్ పట్టణంలో రూ.వందల కోట్ల నిధులతో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైట్లు, డివైడర్ల నిర్మాణం వంటివి ఎన్నో అభివృద్ధి పనులు చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేవరకూ ప్రతిపక్ష పార్టీగా పోరాడుతూనే ఉంటామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 80 శాతం పూర్తయిన వంద పడకల దవాఖానను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.