CJP protest : పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన సీజేపీ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సీనియర్ న్యాయవాదులు ఎన్.హరిహరణ్, గోపాల్ శంకరనారాయణన్, వికాస్ సింగ్‌లు ఈ పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఢిల్లీ పోలీసులు ఈ నెల 18న అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. దీన్ని నిరసిస్తూ సీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 20, సోమవారం పార్లమెంట్ మార్చ్ జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. భాష్ప వాయువు ప్రయోగించారు. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఇదే సమయంలో ఆందోళనకారులు జరిపిన దాడుల్లో పలువురు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో పోలీసుల తీరువల్లే ర్యాలీ హింసాత్మకంగా మారిందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉద్యమకారులపై పోలీసులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే లాఠీచార్జి చేశారని, వారి తీరువల్లే ఈ నిరసన హింసాత్మకంగా మారిందని లాయర్లు కోర్టుకు తెలిపారు. మహిళలపై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజాస్ కరియా ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
ఈ ఘటనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోగ్రఫీ, బాడీ క్యామ్ ఫుటేజ్ వంటి ఆధారాల్ని భద్రపరచాలని సూచించింది. పోలీసులు సమాధానం చెప్పిన తర్వాత అవసరమైతే రీజాయిండర్లు దాఖలు చేయొచ్చని పిటిషనర్లకు కోర్టు సూచించింది. ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 11న జరగనుంది.