ఊట్కూర్, సెప్టెంబర్ 15: హామీలు ఘనం.. అమలు మాత్రం శూన్యం అన్నట్లుగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో విద్యుత్ పరిస్థితి తయారైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు సాగునీరు అందించాల్సిన సమయంలో విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. గంటల తరబడి కరెంట్ కోసం ఎదురుచూస్తూ పంటలను కాపాడుకునే పరిస్థితి లేదంటూ మంగళవారం ఊట్కూర్ చెక్‌పోస్టు ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు.
24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీ ఏమైంది? అని రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు.
కరెంట్ కోతలతో వ్యవసాయ బోర్లు, మోటార్లు పనిచేయక పంటలకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో విద్యుత్ సమస్యతో నష్టపోవాల్సి వస్తోందని వాపోయారు.
రైతుల ధర్నాకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోరం శివరాజ్ రెడ్డి, తరుణ్, ప్రేమ్ సుధాకర్ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు. రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తామని చెప్పి.. ఇప్పుడు గంటల తరబడి కోతలు విధించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు.
ప్రచారంలో ఇచ్చిన హామీలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటకు నీరు కావాల్సిన వేళ కరెంట్ కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ కోతలను తక్షణమే నిలిపివేసి, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రెడ్డి, షేక్ షమీ, ఒబేదుర్ రహ్మాన్, భరత్ రెడ్డి పాల్గొన్నారు. ధర్నాతో మక్తల్, నారాయణపేట వైపు వెళ్ళే వాహనాలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.