Rajnath Singh : నీట్-యూజీ 2026 (NEET-UG 2026) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర రక్షణ మంత్రి (Union Deffence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థులు, యువతను ప్రతిపక్షాలు రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం (Union Govt) చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం విద్యార్థులు, యువత సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. విద్యార్థుల ప్రతి ఆందోళనను విని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ప్రతిపక్ష నేతలు సృష్టిస్తున్న ఆగ్రహ వాతావరణం ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించే విఫలయత్నమేనని విమర్శించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై చర్చకు ప్రభుత్వం మొదటి నుంచే సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఇలాంటి అంశాలపై చర్చ జరగాల్సిన వేదిక పార్లమెంటేనని, వీధుల్లో కాకుండా సభలోనే ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని రాజ్నాథ్ సూచించారు. పార్లమెంట్ సజావుగా నడిచేలా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.