సిటీబ్యూరో, సెప్టెంబరు 16 (నమస్తే తెలంగాణ) : మాగంటి గోపీనాథ్..1983 సంవత్సరంలో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి 42 ఏండ్ల రాజకీయాల్లో విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వరుసగా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మాగంటి గోపీనాథ్ ప్రజా సంక్షేమమే పరమావధిగా.. అహర్నిశలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల కోసం అలుపెరుగని ప్రజానేతగా తనదైన ముద్రవేసుకున్నారు. కష్టం అని ఎవరొచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి సమస్యలను పరిష్కరించడంలో దిట్ట. ఒకసారి మనసుకు నచ్చితే స్నేహాన్ని వదులుకోరు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు.
రాజకీయ, వ్యాపార, సినీ, పారిశ్రామిక రంగాల్లో ప్రముఖులంతా ఆయనకు సుపరిచితులే. అన్నిటికంటే ప్రజలతో ప్రతి నిత్యం మమేకమై అనేక సమస్యలను పరిష్కరించి, మృధు స్వభావిగా మంచిపేరు తెచ్చుకున్నారు..అందుకే ఆయనను నియోజకవర్గ ప్రజలు ఇంటి మనిషిలో ఒకరిగా చేసుకున్నారు.. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు మరువలేనివంటూ కోడ్మో-కనెక్టింగ్ డెమోక్రసీ’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతున్న దరిమిలా కోడ్మో అనే సర్వే సంస్థ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వేను చేపట్టింది. ఈ సర్వే మాగంటి గోపీనాథ్ పనితీరుపై నియోజకవర్గంలో సబ్బండ వర్గాల నుంచి సర్వే శాంపిల్స్ సేకరించగా.. అందులో 49.5శాతం మంది ప్రజలు మాగంటి పనితీరు బాగుందని పేర్కొన్నారు. 21.9శాతం చాలా బాగుందని, 13 శాతం యావరేజ్‌గా ఉందని, 7.3శాతం బాగాలేదని, 8.3శాతం అసలు బాగలేదని సర్వేలో వెల్లడైంది.
హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బీఆర్ఎస్ జెండాను తిరుగులేని శక్తిగా మార్చారు. ఈ నేపథ్యంలోనే కోడ్మో-కనెక్టింగ్ డెమోక్రసీ’సంస్థ అన్ని వర్గాల నుంచి నుంచి ఆదరణ కలిగిన నేతగా తేలింది. భౌతికంగా మాగంటి గోపీనాథ్ నియోజకవర్గానికి దూరమై..ఆయన ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఆయన పై 47.2శాతం మంది మంచినేతగా, 26.2 శాతం మరచిపోలేని ప్రజానేతగా నిలిచారు. అత్యధికంగా 67శాతంతో బడుగు బలహీన వర్గాల బాంధవుడిగా నిలిచారు. కాపు, రజక, గౌడ, కమ్మ, బ్రాహ్మణ, రెడ్డి వర్గాలకు ఆపద్భాంధవుడిగా నిలిచారు.
నియోజకవర్గంలో కుల, మతాలకు అతీతంగా మాగంటి గోపీనాథ్ సేవలందించారు. సర్వేలోనూ ఇదే స్పష్టమైంది. ప్రధానంగా 19 ప్రాంతాల్లో సర్వే జరపగా శ్రీరాం నగర్ 64.2 శాతం, ఎల్లారెడ్డి గూడ (61.7శాతం) ప్రాంతం ప్రజలు ఎక్కువగా మాగంటి గోపీనాథ్ సేవలను కొనియాడుతున్నారు. ఇదే రీతిలో బోరబండ, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, షేక్‌పేట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, కృష్ణారగ్, వెంకటగిరి, మోతీనగర్, టౌలిచౌకి, జవహర్‌నగర్, మధురానగర్, వెంగల్రావు నగర్, ఫిలింనగర్, ఏజీ కాలనీ వాసులు మాగంటిని స్మరించుకుంటున్నారు.
మాగంటి గోపీనాథ్ పనితీరుతో పాటు ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. కోడ్మో-కనెక్టింగ్ డెమోక్రసీ’ సంస్థ క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీసింది. ఇందులో ఎక్కువగా గడిచిన 22 నెలలుగా సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నట్లు తేల్చారు. అన్ని అంశాలపై ప్రజల నుంచి వివరాలను సేకరించగా..అత్యధికంగా డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారి ఇబ్బందులకు గురి చేస్తుందని, నియోజకవర్గంలో 14 శాతంతో అతిపెద్ద సమస్యగా నిలిచింది.
ఆ తర్వాతి స్థానం రహదారులు అధ్వానంగా మారాయని, గతుకుల రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగడం లేదంటున్నారు. 11 శాతం మంది రహదారుల నిర్వహణపై సర్కారు తీరుపై మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజా పాలన ప్రభుత్వం విస్మరించిందని, 12.3 శాతం మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. డ్రింకింగ్ వాటర్ సమస్యతో తీవ్రంగా ఉందని, 11 శాతం మంది లోపాలను ఎత్తిచూపారు. కరెంట్ కోతలపై భగ్గుమన్నారు. ప్రాంతాల వారీగా సర్వేలోశ్రీరాం నగర్లో 23.5 శాతం మంది రహదారులు బాగా లేవని, ఫిలింనగర్లో డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉందంటూ 46.7శాతం మంది భగ్గుమన్నారు.