సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ: ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు అందిస్తున్న నాసిరకం డైట్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ దవాఖానల్లో నాణ్యత లేని డైట్ అందిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా)అధికారులు దాడులు జరపగా తాజాగా నిలోఫర్ దవాఖానలో రోగులకు అందించిన అన్నంలో పురుగులు బయటపడ్డాయి. నిలోఫర్ దవాఖానలోని యూనిట్-3 వార్డులో చికిత్స పొందుతున్న రోగికి బుధవారం మధ్యాహ్నం రోజువారీగానే భోజనం అందించారు.
అన్నంలో పురుగు దర్శనమిచ్చింది. దీంతో సదరు రోగి పురుగులు వచ్చిన అన్నాన్ని వార్డులో ఉన్న సిస్టర్‌కు చూపించారు. దవాఖానలో రోగులకు వడ్డించే ఆహారంలో తరచూ పురుగులు వస్తున్నాయని దీనిపై వార్డుల్లో ఉన్న సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రోగులు వాపోతున్నారు. భోజనం వడ్డించే వారిని ప్రశ్నిస్తే అవి బియ్యంలోని పురుగులే ఏమి కాదు, తినండి, మీ ఇళ్లలో రావా అంటున్నారని రోగులు మండిపడుతున్నారు. చికిత్స కోసం వచ్చినం, వాళ్లతో, వీళ్లతో గొడవలు ఎందుకుని మిన్నకుండా ఉంటూ, వీలైతే బయట నుంచి భోజనం తెచుకుంటున్నట్లు రోగి సహాయకులు చెబుతున్నారు.
గత్యంతరం లేని రోగులు చేసేది లేక అక్కడ లభించే నాసిరకం ఆహారాన్నే తీసుకుంటున్నట్లు రోగి సహాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా రోగులకు అందించే డైట్లో కోత విధించడమే కాకుండా నాణ్యత లేని ఆహార పదార్థాలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా నిలోఫర్‌లో డైటీషియన్ పోస్టు ఖాళీగా ఉండడంతో రోగులకు అందిస్తున్న డైట్ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది.
అన్నంలో పురుగులు వచ్చిన విషయం మా దృష్టికి వచ్చింది. కాని నేను లైవ్‌లో చూడలేదు. ఫొటో చూశాను. అన్నంలో పురుగు ఉన్న విషయాన్ని రోగి వెంటనే నా దృష్టికి తీసుకువచ్చి ఉంటే బాగుండేది. వార్డులో ఉన్న సిస్టర్‌కు చూపించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం. రోగులకు అందించే డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రోగులకు మరింత నాణ్యమైన డైట్ అందించేందుకు ప్రయత్నిస్తాం.
– డా.స్రవంతి, ఆర్ఎంఓ