తెలంగాణ, ఆంధ్రలోని ఒకే తరహా సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఒక వర్గం మీడియా ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం, సదరు మీడియాలో వెలువడే కథనాలు, వాటి ఉద్దేశం గురించి ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతుల కండ్లకు గంతలు కట్టి, వాస్తవాలను వక్రీకరించి, ఇక్కడి అన్నదాతల ప్రయోజనాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ, తెలంగాణ సాగు సడుగులిరిగేలా చేసింది, ఇప్పటికీ చేస్తున్నది ఈ పక్షపాతపూరిత కథనాలే.
వాస్తవానికి గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే. కానీ, మీడియా వీటిని ‘సుజల స్రవంతి’ పథకాలని నొక్కిచెప్తూ, అవి మంచి పథకాలనే భావనను కలిగిస్తున్నది. భారీ ఎలక్ట్రిక్ మోటర్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సొరంగాలు, లిఫ్ట్ ఇరిగేషన్కు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలపై ఆధారపడటం ద్వారా ఈ రెండు పథకాలు లిఫ్ట్ ఆధారిత సాగునీటి ప్రాజెక్టులే తప్ప, గ్రావిటీ ద్వారా నడిచే ప్రాజెక్టులు ఏ మాత్రం కావని స్పష్టమవుతున్నది. ఇవి ఇంచుమించు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులే.
తెలంగాణ పట్ల చారిత్రక అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. గత 60 ఏండ్లలో ఏ పెద్ద ప్రాజెక్టూ గోదావరి, కృష్ణా నదులను సమర్థవంతంగా వాడుకోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అలుముకున్న ‘నిందల’ కథనాల వలె ఏపీలోని ‘సుజల స్రవంతి’ పథకాలపై కథనాలు, వార్తలు ప్రచురితం కాకపోవడంపై తెలంగాణ యువతలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాజెక్టుల విషయంలో ఆర్థికంగా సాధ్యాసాధ్యాలు, వ్యయం-ప్రయోజనాల విశ్లేషణ, విద్యుత్తు భారం, భూసేకరణ, డీపీఆర్లు, ముఖ్యంగా నదీ బేసిన్ల వెలుపల నీటి మళ్లింపులపై పత్రికలు, టీవీ ఛానళ్లలో చర్చలు ఎందుకు జరగడం లేదని వారు ఆలోచిస్తున్నారు.
కృష్ణా, గోదావరి నీటిని కరువు పీడిత ప్రాంతాలకు మళ్లించడమనేది ప్రభుత్వం, పాలకుల దయకాదు, అది ఆధునిక భారతదేశంలో ప్రతి రైతు హక్కు. ఏపీలో సాగునీటి విజయాల గురించి ఉత్సవాలు జరుపుకోండి. ఎవరూ కాదనరు. కానీ, అదే సమయంలో సాగునీటి కోసం తెలంగాణ చేసే ప్రయత్నాలపై నిందలు వేయడం, ఆరోపణలు చేయడం, లేనిపోని అనుమానాలు వ్యక్తంచేయడం సరికాదు. రెండు రాష్ర్టాల మధ్య పక్షపాత ధోరణితో కూడిన ఈ కథనాలు- రాజకీయాలు, మీడియా సంస్థల్లో లోతుగా పాతుకుపోయిన ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇలాంటి మీడియా సంస్థలు ఇప్పటికీ హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తుండటం విచారకరం. దశాబ్దాలపాటు కష్టాలను అనుభవించిన తెలంగాణ రైతులు, యువత ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో, పూర్తి స్పష్టతతో ఉన్నారు. పక్షపాతపూరిత మేధావులతో రాజీపడిన ప్రజాస్వామ్య నాలుగో స్తంభం, అంటే మీడియా పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంగా సాగిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ గ్రామీణ యువత నేడు తెలంగాణ అవసరాల కోసం గోదావరి, కృష్ణా నదీ జలాలను వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను చాలా నిశితంగా గమనిస్తున్నది. వ్యవసాయం చేసేందుకు తమ తల్లిదండ్రులు పడిన కష్టాలను కండ్లారా చూసిన, సాగునీటి కోసం తమ తాతముత్తాతలు పడ్డ వ్యథలను విన్న నేటి యువతరం మదిలో పంటలు పండక అప్పుల ఊబిలో చిక్కుకొని వలసపోయిన విషాదకరమైన
జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి.
పొట్టకూటి కోసం తమ తల్లిదండ్రులు పట్టణాలకు వలసపోవడం, వృద్ధుల దగ్గర పిల్లలను వదిలివెళ్లడం, గ్రామాలు ఖాళీ అవడం లాంటి భయానక దృశ్యాలను వారు ఇంకా మర్చిపోలేదు. గోదావరి జలాలను వాడుకోవడం; గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ నీటి వాటాలను కాపాడటంలో నేటి పాలకుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, వైఫల్యంపై గ్రామీణ యువత నేడు ప్రశ్నిస్తున్నది.
కాళేశ్వరం ఫలితంగా తెలంగాణలో కొత్త తరం నిరాశతో కాదు, భవిష్యత్తుపై ఆశతో వ్యవసాయంపై అభిమానం పెంచుకుంటున్నది. రైతుబంధు ద్వారా నేరుగా నగదు సాయం చేయడం, 24 గంటల ఉచిత విద్యుత్తు అందించడం, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా సమృద్ధిగా సాగునీరు పారడంతో పాటు, ఇతర రైతు సంక్షేమ పథకాల అమలుతో యువత ఇప్పుడు వ్యవసాయాన్ని ఒక ఉపాధిగా భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారిలో ఆలోచన మొదలైంది. కాళేశ్వరం లాంటి ప్రయత్నాలు రెండు మూడు దశాబ్దాల కిందటే జరిగినట్లయితే తమ బతుకులు ఎలా ఉండేవోనని అనుకుంటున్నారు. ముఖ్యంగా, ఇంతకాలం ఎందుకు ఆలస్యమైందని యువ రైతులు నేడు ప్రశిస్తున్నారు.
తమకు న్యాయంగా రావాల్సిన కృష్ణా, గోదావరి నీటి వాటా గురించి కూడా ఈ తరానికి పూర్తి అవగాహన ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత నీటి వినియోగం గురించిన అవగాహన కూడా వారికి ఉంది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తమను మించినవారు లేరని గొప్పలు చెప్తున్న కొన్ని పార్టీల వైఖరిని వారు విమర్శనాత్మకంగా విశ్లేషిస్తున్నారు. రైతులతో కాదు, రైతుల సంక్షేమం కోసం రాజకీయాలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
(వ్యాసకర్త: ప్రొఫెసర్, సోషియాలజీ విభాగం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం)
– చంద్రి రాఘవరెడ్డి