మంచిర్యాల, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొందరు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు రియల్టర్ల చేతిలో కీలు బొమ్మలుగా మారినట్లు తెలుస్తున్నది. సర్పంచ్‌లుగా గెలిపించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టామని, తాము చెప్పినట్లే వినాలంటూ బడా లీడర్లు, వ్యాపారులు హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తుండగా, సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.
గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలిచిన అభ్యర్థులకు కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికల సందర్భంగా గ్రామస్తులకు చేసిన వాగ్ధానాలు, ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఏం చేయాలన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అవసరమైతే పార్టీ మారేందుకు కొందరు సర్పంచ్‌లు సిద్ధం అవుతున్నారు. మా పార్టీలో చేరిన వారికి రూ.5 లక్షలు గిఫ్ట్‌గా ఇవ్వడంతోపాటు గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు ఇస్తామన్న అధికార పార్టీ ఆఫర్ ఓ వైపు ఎలాగూ ఉంది. దీంతో కొందరు కొత్త సర్పంచ్‌లు ఆ దిశగా ఆలోచనలు చేస్తుంటే.. మరికొందరు కొత్త సర్పంచ్‌లు ఏం చేయలేక మిన్నకుండిపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థులుగా గెలిచిన వారిలో కొందరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫండింగ్ చేశారు. కొన్ని చోట్ల గ్రామాల్లోని బడా నాయకులు పెట్టుబడి పెట్టారు. దీంతో పేరుకే నువ్వు సర్పంచ్, మేం ఏం చెబితే అదే చేయాలి. ఎందుకంటే నువ్వు గెలిచేందుకు మేం ఖర్చు పెట్టుకున్నామంటూ వ్యాపారులు, బడా లీడర్లు హు కుం జారీ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఏం చేయలేక సర్పంచ్ అన్న పేరుకే పరిమితం కావాల్సి వస్తుందంటూ ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఓ మండలంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థులకు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టుబడి పెట్టింది. ఒకటి కాదు రెండు కాదు.. ఆ సంస్థకు సంబంధించి వెంచర్లు ఉన్న దాదాపు 10 గ్రామాల్లో దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్‌లను గెలిపించుకుంది. రానున్న రోజుల్లో ఆ సంస్థ చేసే ఇల్లీగల్ దందాకు ఎలాంటి అడ్డం లేకుండా, గ్రామ సర్పంచ్‌లను మచ్చిక చేసుకునే అవసరం లేకుండా.. సర్పంచ్‌లుగా తమకు అనుకూలమైన వ్యక్తులను గెలిపించుకున్నట్లు తెలిసింది. ఇదే అదనుగా తన ఇల్లీగల్ వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఆ సంస్థ నిమగ్నమైంది. ఇప్పుడు ఆ సర్పంచ్‌ల్లో కొందరు వేరే పార్టీల్లోకి వెళ్తామంటే దానికి సదరు సంస్థ ఒప్పుకోవడం లేదని సమాచారం.
మేం చెప్పే దాక వెయిట్ చేయాలని, మేం ఏం పార్టీలో చేరమంటే ఆ పార్టీలోనే చేరాలంటూ హుకుం జారీ చేసినట్లు వినికిడి. ఇక గ్రామాల్లో పలుకుబడి ఉన్న కొందరు బడా లీడర్లు రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో పోటీ చేయలేదు. దీంతో వారు తమ అనుచరులను బరిలోకి దించారు. వారి కోసం డబ్బులు ఖర్చు పెట్టడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రచారం చేశారు. ఇలా కొన్ని చోట్ల తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇప్పుడు తమ ప్రోద్భలంతో గెలిచిన సర్పంచ్‌లను చేతిలో పెట్టుకొని పదవుల కోసం కొందరు సదరు లీడర్లు ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి గ్రామాల్లో సర్పంచ్ కన్నా కూడా ఆయన వెనుకున్న పెద్ద లీడర్లే పెత్తనం చెలాయించనున్నారు. గ్రామాల్లో కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో జిల్లాలో ఇప్పుడు ఈ చర్చ జోరుగా సాగుతున్నది.