న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు లక్ష దాటిపోయాయి. ప్రభుత్వరంగ సంస్థలు అత్యధికంగా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడానికి మొగ్గుచూపడంతో ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయంగా 1,00,266 పెట్రోల్ బంకులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 90 శాతం ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో నడుస్తున్న బంకులు ఉండటం విశేషం.
అలాగే ప్రపంచ దేశాల్లో మూడో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచినట్లు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ తాజాగా వెల్లడించింది. తొలి స్థానంలో అమెరికా ఉండగా, ఆ తర్వాత స్థానంలో చైనా నిలిచింది. వీటితోపాటు ప్రైవేట్ సంస్థలైన నయారా, రిలయన్స్-బీపీ, షెల్లు సంయుక్తంగా 10 వేల వరకు నిర్వహిస్తున్నాయి. 2015లో దేశవ్యాప్తంగా 50 వేల స్థాయిలో ఉన్న పెట్రోల్ బంక్‌లు కేవలం పదేండ్లలో రెండింతలు పెరుగడం విశేషం.