పుణె, డిసెంబర్ 25: ‘మాకు ఓటేయండి.. బైక్‌లు, కార్లు పొందండి.. థాయ్‌లాండ్ ట్రిప్‌నకు వెళ్లండి.. బంగారం, చీరలు, బహుమతులు తీసుకోండి’ అంటూ ఓటర్లను ఉచితాలతో తీవ్రంగా ప్రలోభపెడుతున్నారు పుణె మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు. మూడు వారాల్లో జరిగే ఈ ఎన్నికల సందర్భంగా వారు చేస్తున్న వాగ్దానాలకు అంతూపొంతు లేకుండా పోతున్నది. గోహ్గావ్-దన్హోరీ వార్డులో అయితే ఒక అభ్యర్థి ఏకంగా 11 మంది ఓటర్లను లక్కీ డ్రాలో ఎంపిక చేసి 1100 చదరపు అడుగుల చొప్పున స్థలం ఇస్తానంటూ ప్రకటించాడు.
దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను కూడా ప్రారంభించాడు. విమాన్ నగర్‌లోని అభ్యర్థులు ఐదు రోజుల విలాసవంతమైన లగ్జరీ టూర్‌కు జంటలను పంపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. అలాగే ఇతర వార్డుల్లో కూడా బంగారం, ద్విచక్ర వాహనాలు, కార్లను లక్కీ డ్రాల ద్వారా తీసి పంచుతామని అభ్యర్థులు హామీనిస్తున్నారు. ఇక మహిళా ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారించి వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పలు చోట్ల వారికి కుట్టు మిషన్లు, సైకిళ్లతో పాటు వేలాది పైతానీ చీరలు, రకరకాల రంగులు, డిజైన్లతో చేతితో నేసిన పట్టు చీరలను ఇప్పటికే పంపిణీ చేశారు. లక్ష రూపాయల ప్రైజ్ మనీతో క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు నిర్వహించి యువ, పురుష ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.