హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డికి సంబంధించిన గాయత్రి ప్రాజెక్ట్స్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఊరట లభించింది. కెరాన బ్యాంకులో గాయత్రి ప్రాజెక్ట్స్కు ఉన్న మొత్తం రూ.8,100 కోట్ల అప్పులో రూ.2,400 కోట్లను వన్-టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పద్ధతిలో చెల్లించేందుకు ఆ కంపెనీ చేసిన ప్రతిపాదనను ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఆమోదించడంతోపాటు ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్టు ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది.
కంపెనీ ప్రమోటర్లు రూ.750 కోట్లు చెల్లించడంతోపాటు మిగిలిన మొత్తాన్ని ఆస్తుల మానిటైజేషన్, పెట్టుబడిదారుల నుంచి నిధుల సమీకరణ తదితర మార్గాల చెల్లించేందుకు ముందుకొచ్చినట్టు తెలిపింది. దీంతో గత మూడేండ్ల నుంచి కొనసాగుతున్న ఈ వివాదం ముగింపు దశకు చేరినట్టు పేర్కొన్నది.