KTR : రాష్ట్రంలోని ఆడబిడ్డలకు, ప్రజానీకానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పండుగ ప్రకృతితో మమేకమై పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుందని ఆయన వెల్లడించారు. పూల బతుకమ్మను తీర్చిదిద్దడం, సామూహికంగా పాటలు పాడుతూ నృత్యం చేయడం తెలంగాణ మహిళల ఐక్యతకు, ఆనందానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మను పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి, అధికారికంగా నిర్వహించిందని గుర్తు చేశారు కేటీఆర్. బతుకమ్మ పండుగకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతికి మరింత గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పది సంవత్సరాలపాటు ప్రతి ఆడబిడ్డకు అన్ని రకాలుగా అండగా ఉండేలా, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించామని కేటీఆర్ గుర్తు చేశారు. పండగ పూట మహిళలకు గౌరవ సూచకంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశామని ఆయన వెల్లడించారు. ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంట్లో సుఖసంతోషాలను, సౌభాగ్యాన్ని నింపాలని, ఆడబిడ్డలందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు.