న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్ల (ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకారం రూ.88 లక్షలపైనే)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. భారతీయ మధ్య, చిన్నశ్రేణి ఐటీ కంపెనీలకు శరాఘాతమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు అమెరికా, ఇటు భారతీయ నిపుణుల్లోనూ ఇదే అంచనాలుండటం గమనార్హం. ముఖ్యంగా స్టార్టప్‌లు, వాటి ఆవిష్కరణలకు ఇది పెద్ద దెబ్బేనని విశ్లేషిస్తుండటం ఒకింత ప్రమాద ఘంటికల్నే మోగిస్తున్నది.
హెచ్-1బీ వీసా మొత్తం ఫీజు ఇప్పుడు 2,000-5,000 డాలర్ల మధ్యే ఉన్నది. అయితే దాన్ని ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది ట్రంప్ సర్కారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాలో పనిచేసేందుకు ఇతర దేశస్తులకు ఇచ్చే వర్క్ పర్మిటే ఈ వీసా. అగ్రరాజ్యంలో తమకు వచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి భారతీయ కంపెనీలు దీనిమీదే ఆధారపడుతున్నాయి. తమ దగ్గరున్న నిపుణులను ఈ వీసా ఫీజులు చెల్లించి అక్కడికి పంపిస్తున్నాయి.
అయితే ఇకపై ఆ ఫీజు పెను భారంగా పరిణమిస్తున్నది. దీంతో అంత పెద్ద మొత్తంలో చెల్లించడం మధ్య, చిన్న కంపెనీలకు అసాధ్యంగానే తయారవుతున్నది. దీంతో అమెరికా ప్రాజెక్టులు ఆయా సంస్థలకు ఇక దూరమేనంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. కంపెనీలు ఆ స్థాయిలో వీసా ఫీజులు చెల్లిస్తే నష్టాలబారిన పడుతాయని, ఒకవేళ ఆసక్తిగల ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చినా.. వారి జీతాల్లో కోతలు తప్పవనీ అంటున్నారు. మొత్తానికి మధ్య తరహా ఐటీ ఇండస్ట్రీకి రిస్కేనని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దుందుడుకు నిర్ణయాలతో ఒంటెద్దు పోకడను అవలంబిస్తున్న ట్రంప్.. భారత్‌ను అన్నిరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక భారత్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ల విస్తరణకూ ట్రంప్ చెక్ పెడుతున్నారు. నిజానికి మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఓపెన్ఏఐ, యాపిల్ సంస్థలు భారత్‌లో జీసీసీల అభివృద్ధికి ప్రణాళికలు వేశాయి. కానీ అమెరికాలోనే ఆ ప్రయత్నాలు చేయాలంటూ ఆయా సంస్థల అధిపతులపై ట్రంప్ ఒత్తిళ్లు తెస్తున్నారు. ఫలితంగా ఈ టెక్ దిగ్గజాల నుంచి వచ్చే భారీ పెట్టుబడులు ఆగిపోయినట్టేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవే నిజమైతే దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరమైనట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం భారతీయ ఐటీ పరిశ్రమ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులతో సతమతమవుతున్నది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు పిడుగు ఇండస్ట్రీపై పడింది. ఒకవేళ టారిఫ్‌లు ఐటీ ఎక్స్పోర్ట్స్పైనా వేస్తే సంక్షోభ పరిస్థితులు ఖాయమన్న అంచనాలున్నాయి.
వీసా విధానంలో భారీ మార్పులు చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లపై పెను ప్రభావాన్నే చూపగలవు. అంతంత ఫీజులు చెల్లించి అమెరికాకు ఇతర దేశాల కంపెనీలు తమ ప్రతిభావంతులైన ఉద్యోగులను పంపించలేని పరిస్థితి వస్తుంది. తద్వారా విదేశీ కంపెనీలకు ముఖ్యంగా భారతీయ మధ్య తరహా సంస్థలకు అమెరికా ప్రాజెక్టులు ఇక దూరమేనని చెప్పవచ్చు.
-అజయ్ భుటోరియా, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు అప్పట్లో సలహాదారు
హెచ్-1బీ వీసాలు కేవలం టెక్నాలజీ రంగ ఉద్యోగులకే గాక.. హెల్త్‌కేర్, ఇతర రంగాల్లోని ప్రతిభావంతులకూ అవసరమే. కాబట్టి ఫీజు పెంపు నిర్ణయం ఆయా రంగాలనూ ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా అమెరికా దవాఖానల్లో పనిచేస్తున్న భారతీయ వైద్యులు తిరిగి స్వదేశానికి వచ్చే వీలున్నది. భారతీయ వైద్య రంగంలోనూ ప్రతికూల ప్రభావం కనిపిస్తుందని అనుకుంటున్నాను.
-కందేరావు కంద్, ఎఫ్ఐఐడీఎస్-పాలసీ చీఫ్