వెల్దండ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ క్షణాన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాలేని పరిస్థితి దాపురించింది. ఇప్పటికే ఆకాశనంటిన ధరలతో అల్లాడుతున్న ప్రజలకు ఆర్టీసీ చార్జీల పెంపుదలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడికి రవాణా సదుపాయాన్ని అందుబాటులో ఉంచవలిసిన ప్రభుత్వం దసరా ( Dasara ) సెలవుల రద్దీని సాకుగా తీసుకుని ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని చూస్తుంది.
శనివారం నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలను ( RTC Charges ) విఫరీతంగా పెంచి ప్రయాణికుల నడ్డి విరిచారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి రూ .130 చార్జి ఉండగా సాయంత్రం వచ్చే వారికి అది కాస్త బంపర్ ఆఫర్‌గా మారి రూ . 190 కి చేరుకుంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా కంగుతున్నారు. ఒక్కసారిగా 30శాతానికి పెంచి బస్సులను నడిపించారు.
వెల్దండ మండల కేంద్రానికి చెందిన జంగిలి ఆనంద్ అనే ప్రయాణికుడు , మరికొంతమంది దసరా సెలవుల్లో వస్తున్న తమ పిల్లలను తీసుకొచేందుకు హైదరాబాదుకు వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఆర్టీసీ చార్జీలు పెంచడంతో ఒక్కసారిగా కంగుతున్నారు. ఇదేమిటని కండక్టర్ ప్రశ్నించగా పెత్తర అమావాస్య, దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం రేట్లు పెంచిందని జవాబు ఇవ్వడంతో వారు బిత్తర పోయారు. మహిళలకు ఉచితం అంటూ పురుషులపై చార్జీలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రయాణికులు ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ మార్పు అంటూ మండిపడ్డారు.