న్యూయార్క్, సెప్టెంబర్ 20: ఉద్యోగ బాధ్యతల పైన, లేక సెలవుల పైన అమెరికా వెలుపల ఉన్న తమ హెచ్-1బీ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులు 24 గంటల్లో అమెరికాకు తిరిగి రావాలని, లేనిపక్షంలో వారు వెలుపలే నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రధాన టెక్ కంపెనీలు హెచ్చరించాయి. అమెరికాలో ఉన్నవారు దేశాన్ని వదిలి వెళ్లవద్దని తమ హెచ్-1బీ వీసాదారులైన ఉద్యోగులను ఆదేశించాయి. హెచ్-1బీ వీసాదారుల చట్టపరమైన జీవిత భాగస్వాములు, వారి అవివాహిత పిల్లలకు హెచ్-4 వీసాలు లభిస్తాయి. ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా ఫీజులు భారీగా పెంచిన నేపథ్యంలో ఆ వీసాలపై ఉన్న తమ ఉద్యోగులు అమెరికాను వదిలి వెళ్లవద్దని మైక్రోసాప్ట్, జేపీ మోర్గన్, అమెజాన్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు సూచించాయి.
హెచ్-1బీ, హెచ్-4 వీసాలు గల తమ ఉద్యోగులకు వివిధ కంపెనీలు జారీ చేసిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. ఇదిలా ఉండగా ట్రంప్ తాజా ప్రకటన గురించి తెలిసిన వెంటనే విమానాశ్రయాలలో ఉన్న పలువురు భారతీయ టెకీలు తమ ప్రయాణాలను మానుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
అమెజాన్, మైక్రోసాఫ్ట్: అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు సెప్టెంబర్ 21 నుంచి(ఆదివారం) అమలులోకి వస్తున్న దృష్ట్యా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలలోగా(తూర్పు కాలమానం) ఉద్యోగులు అమెరికాకు తిరిగి రావాలి. ఊహించగల భవిష్యత్తు కోసం అమెరికాలోనే ఉండాలి.
జేపీ మోర్గాన్: ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసాదారులు దేశంలోనే ఉండాలి. ట్రంప్ ప్రభుత్వ స్పష్టమైన ప్రయాణ మార్గదర్శకాలు జారీ చేసేవరకు అంతర్జాతీయ ప్రయాణాలను మానుకోవాలి.
అమెజాన్ : 10,044
టీసీఎస్ : 5,505
మైక్రోసాఫ్ట్ : 5,189
మెటా : 5,123
యాపిల్ : 4,202
గూగుల్ : 4,181
డెలాయిట్ : 2,353
ఇన్ఫోసిస్ : 2,004
విప్రో : 1,523
టెక్ మహీంద్ర అమెరికాస్ : 951