వరంగల్ చౌరస్తా : కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఎంజీఎం హాస్పిటల్లో రోగుల దుస్థితి. ఆరోగ్యం బాగాలేదని వైద్యం కోసం వెళ్తే వైద్యుల నిర్లక్ష్యానికి రోగి ప్రాణాల మీదకు వచ్చింది. వైద్యులు రోగి ప్రాణాలతో చెలగాటమాడారు. రోగికి అవసరమైన రక్తాన్ని కాకుండా ఇతర గ్రూపు రక్తాన్ని ఎక్కించడంతో ప్రాణాపాయస్థితికి చేరుకుంది. ఈ ఘటన శనివారం ఎంజీఎం హాస్పిటల్లో చోటుచేసుకుంది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం ఆయోధ్యాపురం ప్రాంతానికి చెందిన ఇలాసాగరం జ్యోతి (34) ఈ నెల 16న తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత ఆనారోగ్య సమస్యలతో ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. జ్యోతిని పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువ ఉందని, వెంటనే బాధితురాలికి రక్తం అందించాలని చెప్పారు. ఆ తర్వాత నమూనాలు సేకరించి, బ్లడ్ బ్యాంకుకు పంపించారు. బ్లడ్ బ్యాంకులో పరీక్షలు నిర్వహించిన టెక్నిషియన్లు బీ పాజిటివ్‌గా నిర్ధారించి పంపించారు.
నిబంధనల ప్రకారం వైద్యులు వెళ్ళి బ్లడ్ బ్యాంకు నుంచి సేకరించిన బ్లడ్ ప్యాకెట్‌ని తీసుకువచ్చి బాదితురాలికి ఎక్కించారు. అప్పటికీ బాదితురాలు తనది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని తెలియజేసినప్పటికీ సిబ్బంది పట్టించుకోలేదు. పరీక్షల్లో బీ పాజిటివ్ వచ్చిందని చెప్పి రక్తం ఎక్కించారు. మరుసటి రోజు (సెప్టెంబర్ 18న) సైతం మరో బీ పాజిటివ్ బ్లడ్ ప్యాకెట్ పెట్టారు. దాంతో భాదితురాలికి అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. రక్తం మారడం మూలంగా వాంతులు, విరోచనాలు, ఒంటిపై దద్దుర్లు రావడం లాంటి లక్షణాలు కనిపించాయి.
దాంతో భాదితురాలి కుటుంబసభ్యులు వైద్యులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన వైద్యులు తిరిగి నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించగా భాదితురాలిది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్‌గా తేలింది. దాంతో విషయాన్ని బయటకి పొక్కకుండా అధికారులు వైద్యం అందించే ప్రయత్నం చేశారు. కానీ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో విషయం బయటపడింది. బాధితురాలు చెబుతున్నా పట్టించుకోకుండా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించడం, బ్లడ్ బ్యాంకులో నమూనాలు పరీక్షించే సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ని వివరణ కోరగా రోగి శరీరంలో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్, ఇతరత్రా కారణాల మూలంగా రక్తం మార్పు చెందే అవకాశం ఉందని, తమ తప్పేమి లేదని బుకాయించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.