Chandrababu | ఆహారమే ఔషధం.. వంటశాలే ఫార్మసీ అనేది ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. అనారోగ్య కారణాలతో ప్రధాని మోదీ, నేనూఎప్పుడూ సెలవు తీసుకోలేదని తెలిపారు. కావాల్సిన దానికంటే ఎక్కువ తినేయడం వల్లే అనారోగ్యాలు వస్తున్నాయని చెప్పారు. వైద్యారోగ్య శాఖపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర సంభాషణ జరిగింది.
మనిషి సగటు వయసు 120 ఏళ్లు కానీ.. 40 ఏళ్లలో 120 ఏళ్లకు తినాల్సిన ఆహారాన్ని తినేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇలా కావాల్సిన దానికంటే ఎక్కువ తినేయడం వల్లే అనారోగ్యాలు వస్తున్నాయని పేర్కొన్నారు. పంచదార, ఉప్పు, వంటనూనె వీలైనంత వరకు తగ్గించుకోవాలని సూచించారు. ప్రశాంతంగా జీవించడం, రోజుకు 8 గంటలు నిద్రపోవడం అందరికీ తప్పనిసరి అని అన్నారు. ప్రతి ఒక్కరూ జీవన విధానం మార్చుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స కంటే రూమ్ల ధరలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటా ప్రభుత్వం వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ 41 రకాల వైద్య పరీక్షలు చేయించి హెల్త్ రికార్డు నమోదు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రూ.రెండున్నర లక్షల ఆరోగ్య బీమా అందజేస్తామని ప్రకటించారు.
ఏపీలో గుండెజబ్బులు, డయాబెటిస్, శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అంటువ్యాధులు, కిడ్నీలు, క్యాన్సర్ వ్యాధులు బాగా తగ్గాల్సి ఉందన్నారు. గర్భిణులు, శిశువుల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిత్యజీవితంలో ఒత్తిడి వల్ల మానసిక వ్యాధులు పెరుగుతున్నాయని అన్నారు. షుగర్, బీపీ రెండూ ఉన్న వారు రాష్ట్రంలో 24లక్షల మంది ఉన్నారని తెలిపారు. ప్రతి క్యాన్సర్ రోగిని గుర్తిస్తామని.. వైద్య చికిత్స అందిస్తామని తెలిపారు. సరైన సమయంలో వైద్యం అందిస్తే రోగులు కోరుకుంటారని తెలిపారు. ప్రస్తుతం 104 వాహనాలు 900 ఉన్నాయని.. అన్ని జిల్లాలకూ వాటిని పంపిస్తామని అన్నారు. రెండో బిడ్డ వద్దని అనుకునేవారు క్రమంగా పెరుగుతున్నారని అన్నారు.