చేర్యాల, మార్చి 8 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.ఆలయంలో మల్లన్న దర్శనంతో భక్తులు పరవశించిపోయారు.స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు “మల్లన్న స్వామి .. మమ్మేలు స్వామి, కొమురవెల్లి మల్లన్న కోటి దందాలు” అనే నినాదాలతో మల్లన్న క్షేత్రం మార్మోగింది. ఎనిమిదో ఆదివారం సందర్భంగా 50వేల మందికి పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయ నిర్వహణలో ఉన్న గదులు, ప్రైవేట్ గదులు అద్డెకు తీసుకుని బసచేశారు.
శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్రలేచి గదుల్లో పవిత్రస్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలో నాలుగు గంటల పాటు వేచి ఉన్నారు. ధర్మదర్శనానికి రెండుగంటలు, శీఘ్రదర్శనానికి మూడున్నర గంటలు, వీవీఐపీ దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బసచేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు.
మరికొందరు గంగరేగుచెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు స్వామివారికి ఒడిబియ్యం, అభిషేకం, అర్చన, బోనాలు తదితర పూజలు నిర్వహించారు.ఆలయ ఏఈవోలు రావుల సుదర్శన్, బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకుడు నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఉత్సవ కమిటీ సభ్యులు, సిబ్బంది,అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో చేర్యాల సీఐ రమేశ్, ఎస్సై మహేశ్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.