హైదరాబాద్, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ) : పోలవరం బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ స్టేటస్ ఏమిటనేది వారంలోగా చెప్పాలని ఏపీ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ సెక్రటరీకి బోర్డు చైర్మన్ బుధవారం లేఖ రాశారు. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా గోదావరి నుంచి 200 టీఎంసీల వరద జలాలను బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు రూ.81వేల కోట్ల అంచనా వ్యయంతో ఏపీ సర్కారు పీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.
ఆ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా బేఖాతరు చేస్తూ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీ కోసం రూ.9.2 కోట్ల అంచనా వ్యయంతో కన్సల్టెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించింది. 22వ తేదీ ఉదయం 11 గంటల్లోగా టెండర్ డాక్యుమెంట్లు సమర్పించాలని కోరింది. ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఈఎన్సీ అమ్జద్హుస్సేన్.. పీపీఏ, సీడబ్ల్యూసీతోపాటు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. టెండర్లపై ముందుకు వెళ్లకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ తాజాగా స్పందించింది. తెలంగాణ ఫిర్యాదును ఉటంకిస్తూ ఏపీ సర్కారుకు లేఖ రాసింది. పీబీ లింక్ ప్రాజెక్టు వాస్తవ స్టేటస్‌ను వారం రోజుల్లోగా తెలపాలని లేఖలో కోరింది.