హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తే అది వేస్ట్ అవుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ దక్కడం కూడా కష్టమేనని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ కలిసి మోసం చేశాయని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇలాంటి మోసానికే తెరలేపారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరిగాయి. తెలంగాణభవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత కళావతి, ఆ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు బీ లక్ష్మి, రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు శైలజ, ఆర్కే లక్ష్మి, అనూరాధ, మంజుల, సత్యవతితోపాటు 200 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి. పెండ్లికాని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దు:ఖంలో ఉన్నారు. కానీ, కాంగ్రెస్ మంత్రులు తన దు:ఖాన్ని కూడా అవమానించేవిధంగా నానా మాటలు మాట్లాడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. విజ్ఞత మరిచి విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసిందేమిటని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు చెప్పేదొకటి, చేసేదొకటని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదవారి ఇండ్లను కూలగొడుతున్నారని, ఇదేనా రాహుల్‌గాంధీ చెప్తున్న మొహబ్బత్ కా దుకాణ్? అని ప్రశ్నించారు. పండుగలు, ఆదివారాలు, రాత్రిళ్లు అని చూడకుండా, గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టిన రేవంత్‌రెడ్డిని రాహుల్‌గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ‘పట్నం మహేందర్‌రెడ్డి ఇల్లు నీళ్లలోనే ఉన్నది. మంత్రి పొంగులేటి ఇల్లు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నది, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ఇవన్నీ కాంగ్రెస్ సర్కారుకు కనబడవా?’ అని ప్రశ్నించారు. బీహార్‌లో ఓటు చోరీ గురించి మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ జూబ్లీహిల్స్‌లో ఓటు చోరీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో భర్తను కోల్పోయిన మాగంటి సునీతా గోపీనాథ్‌ను ఓడించడానికే 20వేల దొంగ ఓట్లు నమోదు చేశారని విమర్శించారు.
హైదరాబాద్ వాసులకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం కోసం కేసీఆర్ 350 బస్తీ దవఖానలు ఏర్పాటుచేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ఏలుబడిలో ప్రస్తుతం ఆ దవఖానల్లో కనీసం మందులు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కేసీఆర్ తెచ్చిన బతుకమ్మ చీరలు, దళితబం ధు, బీసీబంధు, మైనార్టీబంధు..ఈ విధంగా అన్నింటినీ కాంగ్రెస్ బంద్ పెట్టిందని దుయ్యబట్టారు. కేసీఆర్ 20వేల లీటర్లు నీళ్లు ఉచితంగా ఇస్తే.. ఇప్పుడు నల్లా బిల్లులు వసూలు చేస్తున్నారని, అందుకే రేవంత్‌రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ వచ్చుడు కూడా కష్టమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. భర్తను కోల్పోయిన ఆడబిడ్డ మాగంటి సునీతా గోపీనాధ్‌ను అందరూ దీవించాలని కోరారు. ప్రధాని మోదీ గోదావరి పుష్కరాలకు ఆంధ్రకు రూ.100 కోట్లు ఇస్తే, తెలంగాణకు గుండుసున్న ఇచ్చారని, ఇదెలా సబ్కా వికాస్ అవుతుందని నిలదీశారు. తెలంగాణ నీటిని దోపిడీ చేసే బనకచర్లకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాదిలో పండించే గోధుమలకు మద్దతు ధర రూ.2,585 ఇచ్చి, వడ్లకు మాత్రం రూ.2,369 ఇస్తున్నదని, గోధుమలకు ఒక నీతి, వడ్లకు మరో నీతా? అని ప్రశ్నించారు. 2014లో బీజేపీ అధికారంలో వచ్చినప్పుడు గోధుమలకు, వడ్లకు సమానంగా రూ.1,400 మద్దతు ధర ఉండేదని, కానీ ఇప్పుడు వడ్లకు ధర పెంచకుండా రైతులను అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వడ్లు పండించడం తెలంగాణ రైతులకు శాపమా? అని ప్రశ్నించారు. బీజేపి తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని, కేసీఆర్ పాలనతోనే హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమే జ్ పెరిగిందని హరీశ్‌రావు వివరించారు. కల్యాణలక్ష్మి, రూ.2,000 పెన్షన్, కేసీఆర్ కిట్టు, షీటీమ్స్ అన్ని కేసీఆర్ తెచ్చినవేనని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు నిజాయితీ ఆ బాకీ కార్డు చెల్లించి ఓటు అడగాలని డిమాండ్ చేశారు.