జాతి వికాసంలో సాహిత్యానిది ప్రత్యేక స్థానం. సాహితీవేత్తల పాత్ర ఎనలేనిది. అందుకే సాహితీప్రియుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ కళారంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఉద్యమకాలంలో స్వతహాగా పాటలు రచించి ఉరకల్తెత్తించడమే కాదు, నాడు ప్రత్యేక పోరాటంలో ఆడిపాడిన కవులు, కళాకారులకు సముచితస్థానం కల్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి, స్వరాష్ట్రంలో కొలువులిచ్చారు. పలువురికి పదవులిచ్చి గౌరవించారు. తెలుగు భాషా దినోత్సవంతోపాటు రాష్ట్ర ఆవిర్భావం, స్వాతంత్య్ర వేడుకల సమయంలో సాహితీవేత్తలను సత్కరిస్తున్నారు. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి కాళోజీ పేరిట ఏటా పురస్కారాలు అందిస్తున్నారు. మరుగున పడ్డ కళలకు జీవం పోస్తున్నారు. కానీ, అదే దేశంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. చరిత్రలో తమకంటూ స్థానం దక్కించుకున్న కవులు, రచయితలు, కళాకారులను బీజేపీ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. సాహితీప్రియుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే సబ్బండ వర్గాలకూ ప్రయోజనం చేకూరుతుందని, అది దేశ వికాసానికే దోహదపడుతుందని సాహితీవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
దేశ ప్రజలకు మేలవుతుంది..
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందింది. కొంత మంది రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసి పైసలు దుర్వినియోగం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్కాదు. అప్పులు చేసినప్పటికీ ఆ డబ్బులతో ప్రాజెక్టులు కట్టింది, రోడ్లు వేసింది. కాలువలు తీసింది. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నది. తెలంగాణలో అభివృద్ధి జరిగిందని ఎవరో చెప్పడం కాదు కేంద్రం ఇచ్చే లెక్కలే చెబుతున్నాయి. 7.5 శాతం ఉన్న వృక్ష సంపద 12 శాతానికి పెరిగింది, ప్రాజెక్టులు కట్టుకున్నం. రైతులకు వ్యవసాయానికి సాయం అందుతుంది. పంటల ఉత్పత్తి పెరిగింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇలా ప్రతీది అభివృద్ధి కరమైన అంశంగానే ఉంది.
వీటన్నింటిపై విమర్శలు చేసే ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఆలోచిస్తే వారికే అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవగాహన లోపంతో ఉన్నదో..? లేక కావాలనే చేస్తుందో తెలియదు కానీ రైతు కోసం ఏ కార్యక్రమం, చట్టం తీసుకున్నా అది పూర్తి వ్యతిరేకంగానే ఉన్నది. రైతు ఎప్పుడు వ్యవస్థీకృతమై ఉండడు. ఒంటరిగా ఉంటాడు. అలాంటి వ్యక్తి పండించిన పంటను అధిక రేట్లు వస్తాయని ఎక్కడో దూర ప్రాంతాలకు తరలించి అమ్ముకోలేడు కదా..? ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకోవాలి. అలా చేయలేమంటూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కేంద్రం చేతులు దులుపుకుంటున్నది. మనది సంక్షేమ రాజ్యం. ఇక్కడ కొంత ఉచిత, కొంత మేలు చేసేవి, కొన్ని ప్రభుత్వాలు భరించేవి ఉంటాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం భరిస్తేనే దేశ ప్రజలు సంతోషంగా ఉంటారు. కానీ పట్టించుకోవడం లేదు. తెలంగాణ మాదిరి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఒక్కసారి అవకాశమిస్తే తప్పేమీ కాదు కదా.. కచ్చితంగా దేశ ప్రజలకు మంచి జరుగుతుందనే బలమైన నమ్మకం నాకున్నది.
– అల్లం వీరయ్య, కవి రచయిత, రైతు, (మంథని)
దేశరాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం కావాలి
అణిచివేతలకు గురైన తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు బలిదానానికీ సిద్ధపడ్డ వ్యక్తి కేసీఆర్. ఆయన లేకుంటే ఈరోజు కండ్లతో తెలంగాణ రాష్ర్టాన్ని చూసేవాళ్లమే కాదు. తెలంగాణ వస్తే ఏమొస్తదన్నోళ్లంతా ఫలాలు అనుభవిస్తున్నారు. కాళేశ్వరజలాలతో రాష్ట్రం సుభిక్షమైందంటే రైతుబిడ్డ ముఖ్యమంత్రి కావడం వల్లనే. నాటి సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైన కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా అనేక పరిశ్రమలు వచ్చేందుకు ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది. దుబాయ్‌కి వలస పోవద్దంటూ ఆయన ఉద్యమ కాలం నాడే చెప్పాడు. దేశ రాజకీయాల్లోకి వస్తే దుబాయ్‌లో ఉన్న మనోళ్ల బతుకులు మారుతయి. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తం కావాలి. కేసీఆర్ నాయకత్వం దేశ రాజకీయాల్లో చాలా అవసరం. తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన వ్యక్తి ప్రపంచానికీ అన్నంపెట్టే దిశగా భారత్‌ను ఎదిగేలా చేస్తాడన్న నమ్మకం ఉంది.
– జనపాల శంకరయ్య, కవి, రచయిత సిరిసిల్ల సాహితీ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి.
కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నరు..
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండడం సంతోషం. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులంతా మన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. గత ప్రభుత్వాల పాలనలో తెలంగాణ ప్రజలు అన్ని విధాలా నష్టపోయారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికీ సంక్షేమ పథకం అందుతున్నది. దేశంలోని పలు రాష్ర్టాల్లో ఇంకా నీటి, విద్యుత్ కొరతలున్నాయి. మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితే లేదు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా పథకాలు ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశ రూపురేఖలు మారుతాయి. కేసీఆర్ సార్ కవులకు, కళాకారులకు పెద్దపీట వేశారు. దేశప్రజలు కేసీఆర్ రాకకోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు గర్వంగా భావిస్తున్నారు.
– ఈదునూరి పద్మ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి, రచయిత, పెద్దపల్లి
దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు ప్రవేశపెట్టి పేదల పాలిటి పెన్నిధిగా మారారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నరు. మిషన్ కాకతీయ పథకంతో బీడు భూములన్నీ సస్యశామల అయ్యాయి. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతున్న సీఎం కేసీఆర్‌కు జనం నీరాజనం పడుతున్నరు. అట్టడుగు వర్గాలను అకున చేర్చుకొని, దేశం మొత్తం అభివృద్ధి పథంలోకి రావాలంటే ముందుచూపు ఉన్న నాయకుడు కేసీఆర్‌తోనే సాధ్యం.
– ఎండీ ఖలీద్, కవి, కరీంనగర్.
ప్రజల శ్రేయస్సు కోరే నాయకుడు..
తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం కేసీఆర్ వినూత్న సంక్షేమ, అభివృద్ధ్ది పథకాలు అమలు చేస్తున్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని పలు రాష్ర్టాలు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నాయి. తెలంగాణ పథకాలు అమలవుతున్న తీరును పలు రాష్ర్టాల సీఎంలు, మంత్రులు తెలంగాణలో పర్యటించి అధ్యయనం చేసి వారి రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కేంద్రం సైతం పలు పథకాలపై ప్రశంసలు కురిపించింది. ఇలా సీఎంగా ఉంటూ దేశాన్ని తెలంగాణ వైపు తిప్పుకున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్త్తే దేశం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుంది.
– అల్లె మధుబాబు, రచయిత, జగిత్యాల
శుభ పరిణామం..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయం. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే తెలంగాణ ప్రజలకే గర్వకారణం. మన రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవు. రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితబంధు వంటి బృహత్తర పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. బీజేపీ ప్రభుత్వ పాలనతో దేశం అన్నిరంగాల్లో వెనుకబడిపోయింది. ధరల భారంతో సామాన్యుడు బతకలేని పరిస్థితి దాపురించింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. తెలంగాణ మాదిరి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు ప్రముఖ గౌరవం దక్కుతుంది. కేసీఆర్ ప్రధాని అయితే దేశం మరింత అభివృద్ధిలోకి నడుస్తుంది.
– దయా నర్సింగ్, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి, మాజీ కో-ఆర్డినేటర్, రచయిత (ఎన్టీపీసీ-రామగుండం)
దేశ గతి మార్పు కేసీఆర్‌తోనే సాధ్యం..
దేశ స్థితిగతులను మెరుగుపరుచడం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. తన పోరాట పటిమను తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసుల్లో నింపి, ప్రజానీకాన్ని ఏకతాటిపైకి తెచ్చి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ నిర్దేశం దేశానికి ఎంతైనా అవసరం. స్వరాష్ట్రంలో ఎనిమిదేండ్ల పాలనలో తనదైన మార్కు అభివృద్ధిని చూపి దేశానికి దిక్సూచిగా నిలిచాడు. మగ్గిపోతున్న మట్టి మనుషుల కండ్లల్లో వెలుగులు పూయించాలన్నా.. రైతుల ముంగిల్లలో ధాన్యరాశులు నిండాలన్నా.. ఆడబిడ్డలు, ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నా.. హరితమయ భారతావని కోసం దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆటపాటలతో పాలు పంచుకున్న మాలాంటి ఎందరో కళాకారులకు అండగా నిలిచిన కేసీఆర్ సారథ్యంలో దేశంలోని కవులు, కళాకారులకు సైతం మేలు జరుగుతుంది.
– ఎములవాడ మహిపాల్, కవి, సాంస్కృతిక సారథి కళాకారుడు
దేశంగర్వించే పథకాలు తీసుకువస్తాడు..
సీఎం కేసీఆర్ దేశరాజకీయాల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రం వలె దేశ ప్రజలు గర్వించే సరికొత్త పథకాలు తీసుకువచ్చి దేశాన్ని ప్రపంచానికే ఆదర్శంగా నిలుపుతాడు. సమైక్యాంధ్ర పాలనలో చీకటి సామ్రాజ్యంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే అభివృద్ధి సాధ్యమని భావించి రాష్ర్టాన్ని సాధించే దాకా అలుపెరుగని కృషిచేసిన మహానుభావుడు కేసీఆర్. సమైక్యపాలనలో కరంటు తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి నుంచి నిరంతరం కరెంట్ సరఫరా చేస్తూ దేశమంతా తెలంగాణవైపు చూసేలా చేసిన నాయకుడు కేసీఆర్. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా, నిరుపేద మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితులకు దళితబంధు, చేతి వృత్తుల వారికి వృత్తిపరమైన పథకాలు ఇలా చెప్పుకొంటూ పోతే కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది. రాష్ర్టానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తిం పు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశాన్ని ప్రపంచదేశాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతాడన్న నమ్మకం ఉంది.
– తాళ్లపల్లి ఛత్రపతి, కవి, రచయిత, చొప్పదండి.