మోర్తాడ్, ఏప్రిల్ 14: జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నదని, రాష్ట్రంలో రేవంత్ పోవాలి, మళ్లీ కేసీఆర్ రావాలి అనే నినాదం మార్మోగుతున్నదని తెలిపారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో వేముల మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిబద్ధత కలిగిన జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు, సామాన్యులు ఎవరిని పలకరించినా ‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి‘ అని చెబుతున్నారని, తెలంగాణ అంతటా ఇదే వినిపిస్తున్నదని చెప్పారు. ఈ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి జగిత్యాల సభ తొలి అడుగు కాబోతున్నదని, ప్రజలందరూ ఏకమై కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి కేవలం అవినీతి అక్రమాలతో దోపిడీకి తెర లేపిందని వేముల మండిపడ్డారు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, మక్కల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. రుణమాఫీ చేశానంటాడు ముఖ్యమంత్రి, కానీ ఎందరికి రుణమాఫీ అయిందో తెలియదని ఆయనే అంటాడు. రైతుబంధు ఎన్నిసార్లు వెశారో తెలియదు అంటాడు, తెలియకపోతే మరీ నువ్వెందుకు ముఖ్యమంత్రివి అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
జగిత్యాలలో జరిగే కేసీఆర్ సభకు బూత్‌స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు అధికసంఖ్యలో కదిలిరావాలని, అందుకోసం సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వేముల పిలుపునిచ్చారు. దుర్మార్గపు పాలనకు ముగింపు పలికేందుకు, తెలంగాణ మళ్లీ రామరాజ్యంలా విరాజిల్లాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆదిశగా కార్యర్తలు నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయంలో మూడు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయలేక, మూడు నెలల్లో పిల్లలు పుడుతారా? అని ఎదురు ప్రశ్నించడం విడ్డూరమన్నారు. మూడు నెలలు కాదు 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఎవరి లోపమన్న విషయాన్ని ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణ దేశంలోనే సముద్రతీరం లేని ఏకైక రాష్ట్రం అని రేవంత్‌రెడ్డి అనడం ఆయన అజ్ఞానానికి పరాకాష్ట అని, దేశంలో ఉత్తర భారతం అంతా సముద్రతీరం లేని రాష్ర్టాలే ఉన్నాయి, ఇలాంటి పిచ్చిమాటలు మాట్లాడే వ్యక్తి సీఎంగా ఉండడం మన దురదృష్టమన్నారు. ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వ పనిగా పెట్టుకుందని విమర్శించారు. కేటీఆర్‌పై ఇప్పటికే ఐదు కేసులు పెట్టారని, కేసీఆర్, హరీశ్‌రావులతో పాటు నాపై కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తున్నారు, కానీ ప్రజా పోరాటాలను ఆపడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణను కడుపులో పెట్టుకుని చూసుకుంటే, రేవంత్‌రెడ్డి మాత్రం అబద్దాలనే పాలసీగా మార్చుకుని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు నేడు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే వేముల స్పష్టంచేశారు