నాదర్గుల్ భూముల విషయంలో బట్టకాల్చి బీఆర్ఎస్ మీద వేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సచివాలయం వేదికగా మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పినట్టు బాలాపూర్ తహసీల్దార్ ఇచ్చిన నివేదికే తేల్చిచెప్తున్నది. 2021 నాటికే ఆ భూముల్లో రేకులు వేయడం, రోడ్లు వేయడం మొదలుపెట్టారని, 2022 నాటికి 95 శాతం అంతర్గత రోడ్లు వేశారని మంత్రి చెప్పింది పూర్తి అవాస్తవమని తేలిపోయింది. ‘నాదర్గుల్ సర్వే నంబర్ 613లో సుమారు 125 ఎకరాల విస్తీర్ణంలో గుట్టలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 35 ఎకరాల్లో ఎస్సీ, బీసీ రైతులు వ్యవసాయం చేస్తున్నారు.
మిగిలిన భూమి అంతా పడావు పడి ఉన్నది’ అంటూ 2022, మార్చిలో అప్పటి బాలాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, కందుకూరు ఆర్డీవోకు పంపిన నివేదికలో స్పష్టంగా ఉన్నది. ఇందులో ఎక్కడా రేకుల ప్రహరీ ఉన్నదని గానీ, ప్రైవేట్ వ్యక్తులు ఆ భూముల్లోకి ప్రవేశించినట్టు గానీ పేర్కొనలేదు. అంటే నాదర్గుల్ భూములు అప్పటికి ప్రైవేట్ చెరలోకి వెళ్లలేదని రుజువైంది. పైగా 373.22 ఎకరాలను నిషేధిత జాబితా (22ఏ)లో చేర్చి కేసీఆర్ సర్కార్ రక్షిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే భూ బకాసురులు చొరబడి చెరబట్టినట్టు అక్కడ ఇప్పుడు మాయమైన గుట్టలే వాంగ్మూలమిస్తున్నాయి.
స్పెషల్ టాస్క్బ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ):నాదర్గుల్ భూముల విషయంలో సచివాలయం వేదికగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పినట్టు బాలాపూర్ తహసీల్దార్ ఇచ్చిన నివేదికే తేల్చిచెప్తున్నది. సచివాలయంలో మంత్రి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన సమయంలో అధికార యంత్రాంగం ఈ నివేదికను ఇవ్వకుండా అసలే ఉండదు. కానీ మంత్రివర్యులు తనకు అనుకూలంగా ఉండేందుకు దీనిని దాచిపెట్టి కేవలం 2016లో జరిగిన మ్యుటేషన్ ఉత్తర్వులను మాత్రమే ప్రదర్శించారు. ఆ ప్రతులను మీడియాకు ఇచ్చారు. 2016లోనే తొలిసారిగా సర్వేనెంబర్ 613లో రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనేందుకు అనేక ఆధారాలున్నా మంత్రి ఉద్దేశపూర్వకంగా వాటిని దాచిపెట్టారనే విమర్శలున్నాయి.

ప్రధానంగా నాదర్గుల్ భూముల్లో అక్రమాలను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకురాగానే నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తదుపరి జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆపై తహసీల్దార్ వరకు అందుకు అనుగుణంగా మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ నేటిదాకా అసలు ప్రభుత్వానికి నివేదిక వెళ్లలేదని విశ్వసనీయ సమాచారం. అంటే ఆ భూములపై వాస్తవ పరిస్థితులను తెలుసుకొనేందుకు కూడా ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి ఆసక్తి చూపకపోవడం వెనుక మర్మమేమిటనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో అధికారులు నివేదిక ఇవ్వకున్నా మంత్రి పొంగులేటి ప్రెస్మీట్లో పలు వివరాలు వెల్లడించడం వెనుక భూములు చెరపట్టిన కార్పొరేట్ నిర్మాణ కంపెనీలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్, డాక్యుమెంట్లు మాత్రమే ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సదరు నిర్మాణ కంపెనీలు, ఆ కంపెనీలకు భూములను అప్పగించడంలో తెర వెనుక ఉన్న ఏజీపీఏ హోల్డర్ కరీముల్లావుద్దీన్ పలుచోట్ల కూడా ఇవే ఆధారాలను ముందు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు మంత్రి మీడియాకు చూపిన మ్యాపులో ఆ భూములన్నీ చదునుగా ఉన్నాయేగానీ ఎక్కడా గుట్టలు కనిపించడం లేదు. తహసీల్దార్ నివేదికలో 125 ఎకరాల విస్తీర్ణంలో గుట్టలున్నాయి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అక్రమ మైనింగ్‌తో గుట్టలన్నీ మాయమయ్యాయనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై చివరకు శాసనసభ సైతం అట్టుడికిన దృశ్యాలను చూశాం.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ సర్కార్‌పై బురదజల్లేందుకు గూగుల్ మ్యాప్‌లు అంటూ నానా తంటాలు పడ్డారు. కానీ బీఆర్ఎస్ హయాంలో ఆ భూముల్లో కేవలం నాదర్గుల్ రైతులు సాగు చేయడం మినహా ప్రైవేట్ వ్యక్తులు రావడం, రేకులు వేయడం జరగనేలేదనేది రైతులు చెప్తున్న వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతులెవరూ బయటికొచ్చి ఆ భూముల్లోకి తమను రానివ్వడం లేదని గానీ, భూములను ఆక్రమిస్తున్నారని గానీ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు.
2022లో బాలాపూర్ తహసీల్దార్ పంపిన నివేదికను పరిశీలిస్తే.. నిరుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కందుకూరు ఆర్డీవో సుప్రీం కోర్టులో వేసిన కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలు ఒకేరీతిన ఉన్నాయి. అంటే 2022 తహసీల్దార్ నివేదిక ప్రాతిపదికన ఈ ప్రభుత్వంలోనూ వాదనలు వినిపిస్తున్నారనేది వాస్తవం.
బీఆర్ఎస్ హయాంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు దొంగ పాస్ పుస్తకాలతో తహసీల్దార్ ముందుకు వస్తే గుర్తించి, తిప్పి పంపారు. ఈ నకిలీ వ్యవహారాలను వెంటనే గుర్తించిన అధికారులు అప్రమత్తమై 2016లో సర్వేనంబర్ 613లోని 373.22 ఎకరాలను నిషేధిత జాబితా (22ఏ)లో చేర్చారు. అదే జాబితా ఇప్పటిదాకా కొనసాగుతున్నది. అంతేగానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ జాబితాలో చేర్చలేదు.
ఈ భూములపై నాలా అనుమతులకు మూడు కంపెనీలు దరఖాస్తు చేసుకోగానే అప్పటికే 22ఏ జాబితాలో ఉండటంతో వెంటనే కందుకూరు ఆర్డీవో అనుమతులను తిరస్కరించారు. దీంతో ఆ కంపెనీలు హైకోర్టును ఆశ్రయిస్తే 2022 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగిల్ బెంచ్ ముందు గట్టి వాదనలు వినిపించి నిర్మాణ కంపెనీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా చేసింది. 2023లోనూ డివిజన్ బెంచ్ ముందు కూడా అదేరకమైన వాదనలను వినిపించడంతో అక్కడా నిర్మాణ కంపెనీలకు చుక్కెదురై తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది.
భూ సంస్కరణల సీలింగ్ చట్టం-1975 ప్రకారం సీలింగ్ పరిధిలోకి వచ్చే భూములకు సంబంధిత ఆర్డీవో రెవెన్యూ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. ఆర్డీవోనే ఆ భూములకు కస్టోడియన్ (సంరక్షకుడు)గా ఉంటారు. ఈ క్రమంలో సీలింగ్ చట్టం అమలు చేసి, వాటిపై ఉన్న వివాదాలను పరిష్కరించేంత వరకు ఆర్డీవో ఆ భూములను తన ఆధీనంలో ఉంచుకోవాలని చట్టం చెప్తున్నది. కానీ అందుకు భిన్నంగా నాదర్గుల్ భూములను ప్రైవేట్ కంపెనీలు తమ చెరలో పెట్టుకుంటే ఆర్డీవో ఎందుకు మౌనం వహిస్తున్నారు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు రెవెన్యూ ఉన్నతాధికారులంతా సీలింగ్ చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారనేది ఎవరికీ అంతుబట్టని అంశంగా మారింది.
‘రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లోని సర్వే నంబర్ 613లో ఉన్న 373.22 ఎకరాలను 2016లో మీ ప్రభుత్వం (బీఆర్ఎస్) ఉన్నపుడు రిజిస్ట్రేషన్లు చేసింది మీరు కాదా? 10.02.2021 నాటికి ఆ భూముల్లో ఏమీ ఏర్పాటు చేయలేదు. ఏ రోడ్డూ వేయలేదు. కానీ 05.12.2021 గూగుల్ మ్యాప్‌లో చూస్తే కొన్ని ప్రాంతాల్లో రేకులు వేయడం, రోడ్లు వేయడం మొదలుపెట్టారు. ఇదంతా నేనేమీ మ్యానిపులేట్ చేసేది కాదు. నా ప్రభుత్వం, నా అధికారులు తయారు చేసి ఇచ్చింది కాదు. 5.01.2022 నాటికి 90 శాతం రోడ్లు వేసినట్టు, 95 శాతం రేకులు వేసినట్టు గూగుల్‌లో కనిపిస్తున్నది. అదేరకంగా 17.11.2022 నాటికి 95 శాతం పూర్తిస్థాయిలో మీ టైమ్‌లో షీట్లు పెట్టి, ఇన్నర్సైడ్లో పూర్తిస్థాయి రోడ్లు వేసింది మీ ప్రభుత్వంలో కాదా? ఇది నేను తయారు చేసింది కాదు కదా’

నాదర్గుల్ భూముల విషయంలో బీఆర్ఎస్ మీద బురద చల్లేలా ఈ నెల 8న సచివాలయం వేదికగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన మాటలివి. ప్రైవేట్ కంపెనీలు ఆ భూములను చెరపట్టింది గత ప్రభుత్వ హయాంలోనే తప్ప తాము వచ్చిన తర్వాత ఏమీ చేయలేదని సెలవిచ్చారు.
‘నాదర్గుల్ సర్వేనంబర్ 613లో ప్రస్తుతం ఉన్న భౌతిక పరిస్థితుల (ఫిజికల్ పొజిషన్) ప్రకారం.. సుమారు 125 ఎకరాల విస్తీర్ణంలో గుట్టలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో నాదర్గుల్కు చెందిన ఎస్సీ, బీసీ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. మిగిలిన భూమి అంతా పడావు పడి ఉన్నది’
-2022, మార్చిలో అప్పటి బాలాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, కందుకూరు ఆర్డీవోకు పంపిన నివేదిక (నంబర్. బీ/363/2022)లో పొందుపరిచిన అంశాలివి! గ్రామంలోని శివరాజ్ బహదూర్ భూములకు సంబంధించిన సర్వేనంబర్లు అన్నింటిపైనా ఇచ్చిన నివేదికలో భాగంగా 613 సర్వేనంబర్‌పై ఇచ్చిన పేరాగ్రాఫ్‌లో ఈ విషయాలను స్పష్టం చేశారు. ఇది బీఆర్ఎస్ నాయకులు చేసిన మ్యానిపులేట్ కాదు.. ఇప్పటికిప్పుడు సృష్టించిన లేఖ అసలే కాదు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో ఉన్న తేదీ (2021) కంటే ఇంకో ఏడాది ఎక్కువ.. అంటే (2022) వరకు కూడా అక్కడ గుట్టలే ఉన్నాయని బాలాపూర్ తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు. ఇందులో ఎక్కడా రేకుల ప్రహరీ ఉన్నదని గానీ, ప్రైవేట్ వ్యక్తులు (కార్పొరేట్ నిర్మాణ కంపెనీలు) ఆ భూముల్లోకి ప్రవేశించినట్టు గానీ పేర్కొనలేదు. అంటే నాదర్గుల్ భూములు అప్పటికీ ప్రైవేట్ చెరలోకి వెళ్లలేదని స్పష్టమవుతున్నది.

ప్రస్తుతం నాదర్గుల్ భూములను చెరబట్టిన నిర్మాణ కంపెనీల వెనుక అసలు సూత్రధారి కరీముల్లావుద్దీన్ అనేది బహిరంగ రహస్యం. శివరాజ్ బహదూర్ వారసులు తనకు ఏజీపీఏ చేశారనే భూమిక మీదనే ఇప్పటిదాకా న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. అయితే 2006 మార్చి నుంచి మే వరకు పలు దఫాలుగా పది డాక్యుమెంట్ల ద్వారా బహదూర్ వారసులు 266.12 ఎకరాల భూములను కరీముల్లావుద్దీన్కు ఏజీపీఏ చేశారు. అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ హయాంలో ఈ భూముల రిజిస్ట్రేషన్లు మొదలైనట్టుగా ఆరోపించారు. కానీ 2006లో ఉమ్మడి రాష్ట్రంలో అందునా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సర్కార్ భూములకు ఎసరు పెట్టే క్రతువు మొదలైనట్టు తహసీల్దార్ నివేదికలో ఆధారాలు కూడా ఉన్నాయి.
సదరు వారసులు కేవలం కరీముల్లావుద్దీన్కే కాకుండా పీ జానకిరామారావు, ఏ పాండురంగం అనే వ్యక్తులకు కూడా మూడు డాక్యుమెంట్ల ద్వారా 2006లోనే 50 ఎకరాల విస్తీర్ణంలో జీపీఏ (డాక్యుమెంట్ నంబర్లు.. 13075, 10824, 11417/2006) చేసినట్టుగా తహసీల్దార్ నివేదికలో ఉన్నది. అంతేకాదు కరీముల్లావుద్దీన్ 613 సర్వేనంబర్‌లో అక్రమంగా వ్యవహరిస్తున్నట్టుగా సదరు జానకిరామారావు ఫిర్యాదు చేసినట్టు తహసీల్దార్ పేర్కొన్నారు.