హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ, కేజీబీవీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనున్నదని సంస్థ కార్యదర్శి రమణకుమార్ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 60వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఆసక్తి గల వారు బుధవారంలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
బడుల్లో భద్రతకు చర్యలు తీసుకోండి: విద్యాశాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : వేసవి సెలవుల్లో బడుల్లో భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఆస్తులు, సామగ్రిని సురక్షితంగా ఉంచేందుకు కీలక ఆదేశాలిచ్చింది. బడుల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు, మ్యూజికల్, స్పోర్ట్స్, ఇన్స్ట్రుమెంట్లు, ఫర్నీచర్, మధ్యాహ్న భోజన వస్తు సామగ్రిలున్నాయి. వీటి రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. ఎంఈవో, డీఈవోల నంబర్లు ప్రదర్శించాలని, స్థానిక, పెట్రోలింగ్ పోలీసుల సహకారం, స్థానిక యువత, ఎన్జీవోల భాగస్వామ్యంతో పర్యవేక్షణ పెంచాలని సూచించింది.
టెట్ అర్హత మార్కులు తగ్గించాలి: పీటీఏ టీజీ
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : టెట్ అర్హత మార్కులు తగ్గించాలన్న విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం తమకు తీవ్ర నిరాశ కలిగించిందని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (పీటీఏ టీజీ) అభిప్రాయపడింది. ఇన్ సర్వీస్ టీచర్లకు మార్కులు తగ్గించకపోవడం బాధాకరమని సంఘం అధ్యక్షుడు కే మల్లికార్జున్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే శారద, అదనపు సెక్రటరీ జనరల్ మేడే దేవదాస్ ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్ టీచర్ల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని, ఏడాదికి ఒక మార్కు చొప్పున వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.