హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు మూణ్ణాళ్ల ముచ్చగా మిగిలింది. రెండు నెలలు తిరగకుండానే ఆ వ్యవస్థ పడకేసింది. తక్కువ ధరతో ఎఫ్ఆర్ఎస్ను అమలు చేస్తామన్న సంస్థలను కాదని ఎలాంటి టెండర్ లేకుండా అధిక ధరతో ఓ గుత్తేదారుకు నేరుగా ఆ బాధ్యతలు కట్టబెట్టినా ఇలాంటి దుస్థితి నెలకొనడంపై సొసైటీ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సొసైటీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఫలితంగానే ఈ దుస్థితి నెలకొన్నదని నిప్పులు చెరుగుతున్నారు. ఎస్సీ గురుకుల సొసైటీలో విద్యార్థుల హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయాలని గతంలో నిర్ణయించడంతో పలు సంస్థలు ఆ సొసైటీని సంప్రదించాయి. ఎఫ్ఆర్ఎస్ నమోదు కోసం ఒక్కో విద్యార్థికి ప్రతిరోజూ గరిష్ఠంగా 8 పైసల చొప్పున చార్జీ చేసేందుకు ప్రతిపాదించాయి. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీలో దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ లెక్కన వారికి ఎఫ్ఆర్ఎస్ కోసం ప్రతిరోజూ రూ.14 వేలకుపైగా ఖర్చవుతుంది. కేవలం గురుకుల పనిదినాలను 300 రోజులుగా పరిగణనలోకి తీసుకున్నా ఒక విద్యాసంవత్సరంలో రూ.43.20 లక్షలు ఖర్చవుతుంది.
దీంతో ఒక్కో విద్యార్థికి 8 పైసల కంటే తక్కువ ధరతో ఎఫ్ఆర్ఎస్ అమలు చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపాయి. కానీ, ఆ సంస్థలను సొసైటీ ఉన్నతాధికారులు పక్కన పెట్టి, ప్రత్యేకంగా డిపార్ట్మెంటల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ కమిటీ సిఫారసు పేరిట టెండర్లను ఆహ్వానించకుండానే ఎఫ్ఆర్ఎస్ నిర్వహణ బాధ్యతలను ఓ ఏజెన్సీకి కట్టబెట్టారు. ఆ సంస్థ ప్రతిరోజూ ఒక్కో విద్యార్థికి 17 పైసల చొప్పున చార్జీ చేస్తున్నది. అదీ కూడా 300 రోజులకు కాకుండా ఏడాది మొత్తానికి కలిపి రూ.1,16,28,900 పుచ్చుకునేందుకు సిద్ధమైంది. దీంతో ఆ గురుకుల సొసైటీపై రూ.72.80 లక్షల మేరకు అదనపు భారం పడింది. అందులో మూడో వంతు భాగాన్ని ఇప్పటికే పుచ్చుకున్న ఆ ఏజెన్సీ.. ఈ ఏడాది జనవరి నుంచి ఎఫ్ఆర్ఎస్ అమలుకు శ్రీకారం చుట్టింది. కానీ, ఇందులో అనేక ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 1 నుంచి ఎఫ్ఆర్ఎస్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో గురుకుల ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్ఆర్ఎస్ అవసరమే లేదు
ఎఫ్ఆర్ఎస్ అమలు నిర్ణయాన్ని ఎస్సీ గురుకుల సొసైటీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆది నుంచే వ్యతిరేకిస్తున్నారు. కమీషన్ల కోసమే సొసైటీ ఉన్నతాధికారులు ఎఫ్ఆర్ఎస్ను ప్రవేశపెట్టారని, అసలు ఇది అవసరమే లేదని మండిపడుతున్నారు. ఎఫ్ఆర్ఎస్ అమలుతో నిధులను వృథా చేయడమే తప్ప విద్యార్థులకు అదనంగా ఒరిగేది ఏమీలేదని నిప్పులు చెరుగుతున్నారు. వాస్తవానికి గతంలో విద్యార్థుల హాజరును స్టూడెంట్ అకడమిక్ మానిటరింగ్ సిస్టమ్ (సామ్స్) ద్వారా నమోదు చేసేవారు. దాని ఆధారంగానే విద్యార్థుల డైట్, మెస్ బిల్లులు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేవారు. ఈ విధానంలో ఎలాంటి అవకతవకలకు ఆసారం ఉండేది కాదు.