న్యూఢిల్లీ: ఏ లిఫ్ట్ ప్రమాదంలోనైనా తయారీదారు, నిర్వహణ ఏజెన్సీ, భవన యజమాని సంయుక్తంగా బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ఈ నెల 29న చారిత్రక తీర్పును ఇచ్చింది. లిఫ్ట్‌ను ‘కామన్ క్యారియర్’గా, ఒక ప్రజా రవాణాగా అభివర్ణించిన కోర్టు.. ప్రజలు దాంట్లోకి నమ్మకంతో ప్రవేశించిన తర్వాత వారి భద్రతకు సంబంధించి తయారీదారు, నిర్వహణ ఏజెన్సీ, భవన యజమానికి బాధ్యత ఉంటుందని తెలిపింది.
2003లో ఆర్ అండ్ ఏడబ్ల్యూ ప్రధాన కార్యాలయంలో లిఫ్ట్ ప్రమాదం వల్ల చనిపోయిన మాజీ దౌత్యవేత్త విపిన్ హండా కేసులో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ 2014లో జారీ చేసిన తీర్పును సమర్థిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వోల్టేజ్ హెచ్చుతగ్గులను పరిష్కరించడానికి స్టెబిలైజర్ అమర్చాలని తాము సూచించినా, వాటిని అమలు చేయలేదని లిఫ్ట్ తయారీ కంపెనీ ఒటిస్ తెలిపింది. అయితే రికార్డుల ప్రకారం లిఫ్ట్ చాలా రోజుల నుంచి సరిగా పని చేయడం లేదని, ఇది ఒటిస్కు తెలుసునని కోర్టు చెప్పింది.