హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మామిడి రైతులపైనా పడింది. ఇటీవల అకాల వర్షాలు, చీడపీడలతో సతమతమైన మామిడి రైతులకు.. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ పరిస్థితులు వెంటాడుతున్నాయి. తెలంగాణ నుంచి ప్రతి ఏడాది సుమారు 7వేల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు యూఏఈ, అమెరికా, కెనడా తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యుద్ధం కారణంగా పెరిగిన విమాన ప్రయాణాలు, రవాణా మార్గాల్లో ఏర్పడిన అంతరాయాల వల్ల 30నుంచి 40శాతం వరకు ఎగుమతులు తగ్గాయి. విమాన రవాణా చార్జీలు కూడా కిలోకు రూ.250 నుంచి రూ.900 వరకు పెరగడంతో మామిడి పండ్లను దిగుమతి చేసుకోవడానికి అక్కడి వ్యాపారులు జంకుతున్నారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లాల్సిన మామిడి పండ్లను స్థానిక మార్కెట్లల్లోనే విక్రయించాలని రైతులు భావిస్తున్నారని వ్యాపారులు చెప్తుతున్నారు. దీని కారణంగా తెలుగు రాష్ర్టాల్లో మామిడి పండ్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.
ఒక్క యూఏఈకే 10వేల మెట్రిక్ టన్నులు
తెలుగు రాష్ర్టాల్లో పండే మామిడి రకాలకు పశ్చిమ ఆసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతి ఏడాది సుమారు 30వేల మెట్రిక్ టన్నుల మామిడి విదేశాలకు ఎగుమతి అవుతుంది. వీటిలో దాదాపు 10వేల మెట్రిక్ టన్నులు ఒక్క యూఏఈ దేశానికి ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయిల్-అమెరికా మధ్య యుద్ధం కారణంగా ఈ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
పండ్ల నిల్వకు 25 రోజులే కీలకం
ఏప్రిల్ రెండో వారం నుంచి మే రెండో వారం వరకు మార్కెట్లలోకి వచ్చే మామిడి పండ్లు అత్యంత నాణ్యమైనవి. ఈ మామిడి పండ్లు నిల్వ కేవలం 20నుంచి 25రోజుల వరకు ఉంటాయి. దీంతో ఎగుమతిదారులు తమ నిల్వలను ఎక్కువకాలం నిల్వ చేసేందుకు సాహసం చేయ రు. ఈ నేపథ్యంలో దిగుమతి అవుతున్న మామిడి పండ్లను స్థానిక మార్కెట్లలో తక్కువ ధరకు అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ కారణంతోనే హైదరాబాద్ మార్కెట్కు ఇతర జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక నుంచి భారీగా మామిడి పండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో బంగినపల్లి మామిడి రూ.180 నుంచి రూ.300, రసాలు రూ.150 నుంచి రూ.200 మధ్య విక్రయిస్తున్నారు.