Stress | అధిక ఒత్తిడి ప్రస్తుతం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. ఒత్తిడి, ఆందోళనతోపాటు డిప్రెషన్ బారిన పడి చాలా మంది మానసిక ఆరోగ్య పరంగా కుదేలవుతున్నారు. చాలా మందికి మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోంది. ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా ఆర్థిక సమస్యల కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి కారణంగా అనేక వ్యాధులు సైతం వస్తున్నాయి. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకోవాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. అయితే ఒత్తిడిని తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. చాలా మంది తమకు తెలిసిన పద్ధతులను ఫాలో అవుతుంటారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు కేవలం వ్యాయామం, హాబీలను పాటించడం మాత్రమే కాకుండా ఆహారం కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి పలు పోషకాలు లభిస్తాయి. ఇవి ఒత్తిడిని తగ్గించుకునేందుకు అద్భుతంగా పనిచేస్తాయి.
చేపలను వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు తింటుంటే మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మూడ్‌ను మారుస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గేలా చేస్తాయి. శరీరంలోని వాపులను సైతం తగ్గిస్తాయి. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. వాల్ నట్స్, బాదంపప్పు, గుమ్మడికాయ విత్తనాలను ఆహారంలో భాగం చేసుకున్నా మేలు జరుగుతుంది. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతోపాటు మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇవి ఒత్తిడి తగ్గేందుకు సహాయం చేస్తాయి. అలాగే పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలను తరచూ తింటున్నా మేలు జరుగుతుంది. వీటిల్లో ఉండే మెగ్నిషియం, ఫోలేట్ న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మూడ్‌ను మారుస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గేలా చేస్తాయి.
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీల వంటి బెర్రీ పండ్లను తింటున్నా మేలు జరుగుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. మనస్సు ప్రశాంతంగా మారేలా చేస్తాయి. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఓట్ మీల్, కినోవా, బ్రౌన్ రైస్‌లను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. వీటిల్లో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. సెరటోనిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. అవకాడోల్లో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు అనేక రకాల బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో ఉండే మెగ్నిషియం నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఇది ప్రో బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. అందువల్ల పెరుగును తింటుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గేలా చేస్తుంది. డార్క్ చాకొలెట్లలో కొకొవా అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటున్నా కూడా మేలు జరుగుతుంది. డార్క్ చాకొలెట్లలో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజూ ఒక కోడిగుడ్డును తినడం కూడా మెదడు ఆరోగ్యంపై పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. కోడిగుడ్లలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సెరటోనిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలను తింటుంటే ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.