Diabetes | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ చాలా మందికి వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, రోజూ గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, వేళకు భోజనం చేయకపోవడం, సరిగ్గా నిద్రించకపోవడం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం వంటివి టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు కారణం అవుతున్నాయి. అయితే టైప్ 2 డయాబెటిస్ వచ్చిన వారు డాక్టర్ సూచించిన మేర మందులను వాడుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పలు చిట్కాలను పాటించడం వల్ల కూడా షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
డయాబెటిస్ ఉన్నవారు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా బార్లీ, కినోవా, బ్రౌన్ రైస్ వంటి ఆహారాలను తింటుంటే మేలు జరుగుతుంది. పప్పు దినుసులు, శనగలు, బ్లాక్ బీన్స్, రాజ్మా వంటి ఆహారాలను కూడా తీసుకోవచ్చు. షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు ఇవి కూడా సహాయం చేస్తాయి. పాలకూర, బ్రోకలీ, క్యారెట్లు, క్యాప్సికం, టమాటాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తింటుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా మనకు పప్పు దినుసులతోపాటు చికెన్, మటన్ వంటి ఆహారాల్లో లభిస్తాయి. కోడిగుడ్లు, పాలు, చీజ్ వంటి ఆహారాలను కూడా తీసుకోవచ్చు. షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో ఇవి కూడా మేలు చేస్తాయి.
చేపల్లో అధికంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్ అదుపులో ఉండేలా చేస్తాయి. తరచూ చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. బీన్స్, పప్పు దినుసులు, నట్స్, సీడ్స్, టోఫు, ఆలివ్ ఆయిల్, బాదంనూనె, కనోలా ఆయిల్, అవకాడో, బెర్రీలు, యాపిల్స్, నారింజ వంటి ఆహారాలను తీసుకుంటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. ఇక షుగర్ లెవల్స్‌ను తగ్గించి డయాబెటిస్‌ను అదుపులో ఉంచేందుకు గాను పలు చిట్కాలు కూడా పనిచేస్తాయి. అందులో భాగంగా మెంతులను కూడా తినవచ్చు. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తాగి అనంతరం ఆ మెంతులను తినాలి. ఇలా పరగడుపున చేయాల్సి ఉంటుంది. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
షుగర్‌ను తగ్గించడంలో కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. కాకరకాయల్లో కారాంటిన్, పాలిపెప్టైడ్-పి అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. షుగర్ లెవల్స్ తగ్గేందుకు సహాయం చేస్తాయి. రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో కాకరకాయ జ్యూస్‌ను తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. దాల్చిన చెక్కను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటున్నా మేలు జరుగుతుంది. దాల్చిన చెక్క పొడిని మీరు తినే ఆహారాలపై చల్లి తినవచ్చు. లేదా దాల్చిన చెక్క వేసి మరిగించిన నీళ్లను తాగుతున్నా కూడా ఫలితం ఉంటుంది. అలాగే షుగర్‌ను తగ్గించడంలో కలబంద కూడా పనిచేస్తుంది. రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో కలబంద రసం తాగవచ్చు. ఇది ఇన్సులిన్‌లా పనిచేస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గేలా చేస్తుంది. ఇలా ఆయా చిట్కాలను పాటించడంతోపాటు ఆహారాలను కూడా తీసుకుంటుండాలి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.