కోదాడ, అక్టోబర్ 18 : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల న్యాయమైన వాటా కోసం శనివారం చేపట్టిన బంద్ కోదాడలో విజయవంతమైంది. బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కోదాడలో సిపిఐ, సిపిఎం, బీసీ సంఘాలతో కలిసి బీఆర్ఎస్. కాంగ్రెస్, బిజెపి, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ను కాంగ్రెస్, బిజెపి అడ్డుకుంటూ దోఖా చేస్తున్నాయన్నారు. 42 శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి బీసీ ఓట్లను దండుకుని ఇప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకంగా తమ సామాజిక వర్గం తోటే కోర్టులో కాంగ్రెస్ నేతలు కేసులు వేయించారని విమర్శించారు.
42 శాతం రిజర్వేషన్ తోనే ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి సైతం మైనార్టీల రిజర్వేషన్ను సాకుగా చూపి మోకాలు అడుగుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే దాకా తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. బీసీ సంఘాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో నాయకులు ఎస్కే నయీమ్, ములకలపల్లి రాములు, ముత్యాలు, ఏపూరి రాజు, మేకల శ్రీనివాసరావు, పచ్చిపాల రామకృష్ణ యాదవ్, సిపిఐ, సిపిఎం, ఎమ్మార్పీఎస్, బీసీ సంఘాలు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Kodada : కోదాడలో బీసీ బంద్ విజయవంతం