మోర్తాడ్/నిజాంసాగర్, జూలై 31: మూడ్రోజులు దంచి కొట్టిన వర్షాలు శుక్రవారం కాస్త శాంతించాయి. కరువు పరిస్థితులు దాపురించి ఆందోళనకు గురవుతున్న అన్నదాతలను భారీ వర్షాలు మురిపించాయి. మంగళవారం నుంచి గురువారం వరకు దంచికొట్టడంతో చెరువులు, కుంటల్లోకి కొత్త నీరు చేరింది. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరుగుతున్నది. తరలి వస్తున్న జల సిరులు కొత్త ఆశలను మోసుకొస్తుండగా, రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. గురువారం రాత్రి ఎస్సారెస్పీకి ఈ సంవత్సరంలోనే అత్యధిక వరద 76,224 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. అయితే, శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఇది కొద్దిగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు, రెండ్రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టులోకి దాదాపు 8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. బుధవారం 15 టీఎంసీల మేర నీరుండగా, శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 23.866 టీఎంసీలకు చేరింది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 291క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తుంది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1070 అడుగులు(23. 866టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది.
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. 4,642 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం1405.00 అడుగులు (17.80 టీఎంసీ)లకు గాను ప్రస్తుతం 1396.30 అడుగులు (7.84 టీఎంసీల) నీరు నిల్వ ఉంది.
నిజాంసాగర్ ఆయకట్టుకు అనుసంధానంగా ఉన్న మహ్మద్‌నగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఎగువ నుంచి 661 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో మూడు వరద గేట్లను ఎత్తి, అంతే మొత్తంలో నిజాంసాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసారు. నీటి పారుదల శాఖ ఏఈఈలు అక్షయ్, సాకేత్, వర్క్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్ శుక్రవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నీటి విడుదలను ప్రారంభించారు.