నిజామాబాద్, జూలై 31, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పెద్ద పులుల ఆచూకి అంతులేని ప్రశ్నగానే మిగిలి పోతోంది. రెండు నెలల క్రితం వరకు అడవిలో గర్జించిన టైగర్ ఇప్పుడు జాడ లేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని భీంగల్‌లో చిట్ట చివరి సారిగా పెద్ద పులి అలజడి కనిపించింది. ఏప్రిల్ 14 తర్వాత పులి పత్తా లేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లాను దాటుకుని జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన ఆనవాళ్లు లేవు. పక్క జిల్లాల్లోనూ ఎలాంటి పాద ముద్రికలు కనిపించలేదు. వేటగాళ్ల ఉచ్చులోనే పెద్ద పులి హతమైనట్లుగా అనుమానాలు బల పడుతున్నాయి.
కానీ అధికారికంగా పెద్ద పులికి ఏమైంది? అన్నది మాత్రం ఎవ్వరూ తేల్చడం లేదు. అటవీ శాఖ నెలల తరబడి ఈ అంశంలో నిర్లక్ష్యం వహించింది. గత డీఎఫ్‌వోలు పట్టనట్లు వ్యవహరించడం మూలంగా పెద్ద పులి ఆచూకి గల్లంతు అయ్యిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పులి కనిపించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి సెర్చ్ ఆపరేషన్‌ను వెనువెంటనే చేపట్టి ఉంటే ఆధారాలు మిగిలి ఉండేదన్న చర్చ అటవీ శాఖలోనే నడుస్తోంది. రెండు నెలల్లో ముగ్గురు డీఎఫ్లు మారారు. తాజాగా ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ కొత్తగా జిల్లా అటవీ శాఖ అధికారి(డీఎఫ్‌వో)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పెద్ద పులి జాడపై కనీస సమాచారం అధికారికంగా వెలుగు చూస్తుందా? లేదా? అన్నది అంతు చిక్కడం లేదు.
నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారిగా కొత్తగా ప్రశాంత్ బాజీరావ్ పాటిల్‌ను ప్రభుత్వం నియమించింది. కేవలం నెలన్నర రోజుల్లో ముగ్గురు అధికారులను అటవీ శాఖ మార్చింది. డీఎఫ్‌వో వికాస్ మీనా బదిలీ తర్వాత ఆయన స్థానంలో సిద్ధార్థ విక్రమ్ సింగ్ వచ్చారు. కేవలం కొద్ది రోజులు మాత్రమే పని చేశారు. అటవీ శాఖ అభివృద్ధి కోసం నెల రోజుల్లోనే తనదైన శైలిలోనే హడావిడి చేశారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అకస్మాత్తుగా ఏమైందో ఏమో కానీ రోజుల వ్యవధిలోనే సిద్ధార్థ విక్రమ్ సింగ్‌ను బదిలీ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ డీఎఫ్‌వోగా ప్రశాంత్ బాజీరావ్ పాటిల్‌కు బాధ్యతలు స్వీకరించారు.
నూతన అధికారికి అనేక సవాళ్లు ముందు నిలిచాయి. ప్రధానంగా పెద్ద పులుల జాడను గుర్తించడం, అడవిని సంరక్షించడంతో పాటుగా పునరుద్ధరణ చర్యలు చేపట్టడం కీలకంగా మారింది. నిజామాబాద్ ఫారెస్ట్ డివిజన్లో నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్, వర్ని, ఇందల్వాయి రేంజ్లో చెట్ల నరికివేత విపరీతంగా సాగుతోంది. దజీనికి తోడుగా ఆర్మూర్ ఫారెస్ట్ డివిజన్లోని ఆర్మూర్, కమ్మర్పల్లి, సిరికొండ రేంజ్లోనూ అక్రమార్కులు నిబంధనలకు విరుద్దంగా చొరబడుతూ పచ్చని చెట్లను నేలమట్టం చేస్తున్నారు. వీటిని అరికట్టడం అటవీ శాఖకు భారీ సవాల్‌గా నిలిచింది. గతంలో పని చేసిన అటవీ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి అడవి నామరూపాల్లేకుండా పోయింది. నూతన అధికారి ఈ విషయంపై దృష్టి సారించి అడవిని సంరక్షిస్తారని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.