నల్లబెల్లి/ములుగు, జూలై31(నమస్తేతెలంగాణ) జూలై 31 : ‘ఆరు నూరైనా.. నూరు ఆరైనా రేపు తెలంగాణ వచ్చి తీరుతది. మనం రాష్ర్టాన్ని సాధించిన తరువాత ఇప్పటి దాకా ఉన్న గోదావరి బేసిన్. కృష్ణానది బేసిన్ అంటూ ఉండదు. రెండు బేసిన్లు కలిసేలా ప్రణాళికలు వేసుకుందాం. కృష్ణాబేసిన్‌లో ఉన్న పాకాల చెరువులో గోదావరి నీటిని తెచ్చిపోసుకుంటం. ఇది నా మాట’ అని సెప్టెంబర్ 30, 2010వ తేదీన తొర్రూరులో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన ప్రకటనను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో పెద్ది గుర్తు చేసి దేవాదుల నదీ జలాలను రామప్ప నుంచి పాకాలకు పెద్ద పెట్టుబడి లేకుండా, ఎలాంటి లిఫ్ట్ అవసరం లేకుండా గ్రావిటీతో తీసుకుపోయే మార్గాన్ని అన్వేషించి ఆచరణ సాధ్యం చేశారు. నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువు, నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు, ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సులకు గోదావరి జలాలను తీసుకువచ్చి సస్యశ్యామలం చేశారు.
అలాగే కృష్ణా బేసిన్ ఉన్న ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించేందుకు దేవాదుల మూడో దశలోని రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి రూ. 336 కోట్లతో రామప్ప- పాకాల పథకం ద్వారా ప్రత్యేకమైన పైపులైన్ ఏర్పాటు చేసి పాకాలకు, రూ. 225 కోట్ల వ్యయంతో రామప్ప-రంగాయచెరువు పథకం చేపట్టి గోదావరి తరలించారు. అలా గే, రంగాయచెరువు ద్వారా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువును నింపి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారు. అదేవిధంగా వేసవి కాలంతో పాటు అత్యవసర సమయంలో పైప్లైన్ల వెంట ఉన్న ఎయిర్ వాల్వ్‌ల ద్వారా ములుగు నియోజకవర్గంలోని పలు చెరువులను సైతం గోదావరి జలాలతో నింపుతున్నారు. దీంతో బీడు భూములు సైతం సాగులోకి వచ్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.