కరీంనగర్‌లోని మెడికవర్ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం యువకుడి ప్రాణం తీసిందా..? ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసి, అబ్జర్వేషన్ లేకుండానే ఇంటికి పంపడమే మృతికి కారణమా..? అంటే కుటుంబసభ్యులు, దళితసంఘాల నాయకులు అవుననే ఆరోపిస్తున్నారు. శని, ఆదివారాల్లో ఆ దవాఖాన ఎదుట ఆందోళన చేసి, నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. పేషెంట్‌ను మూడు రోజులే ఉంచుకొని ఇంటికి పంపించారని, అబ్జర్వేషన్ లేకపోవడం వల్లే మృతి చెందాడని ఆవేదన చెందారు. పైగా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేసినా అదనంగా 60వేల వరకు వసూలు చేశారని వాపోయారు. అయినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కరీంనగర్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని శాంతినగర్‌కు చెందిన రొడ్డ అనిల్ (33) పేయింట్ పని చేసుకుని జీవిస్తున్నాడు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఆ యువకుడికి ఈ నెల 6న గుండెలో నొప్పి రావడంతో కరీంనగర్‌లోని మెడికవర్ దవాఖానకు తీసుకువచ్చారు. వెంటనే పరీక్షల కోసం 10 వేలు కట్టించుకున్నారు. అనంతరం హార్ట్ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దళితుడైన అనిల్ కుటుంబం వద్ద అంత డబ్బు లేకపోవడంతో ఆరోగ్యశ్రీలో హార్ట్ ఓపెన్ సర్జరీ చేస్తామని తెలిపారు. అయితే, క్వాలిటీ స్టంట్స్ కావాలంటే ఆరోగ్యశ్రీలో వచ్చే ఫండ్‌కు అదనంగా 50 వేలు చెల్లించాలని దవాఖాన మేనేజ్మెంట్ అనిల్ కుటుంబ సభ్యులతో చర్చించింది. అందుకు అంగీకరించిన అనిల్ కుటుంబ సభ్యులు ఈ నెల 8న దవాఖాన ఎంవోడీ ఎడ్ల సాయికృష్ణ ఫోన్‌కు ఆన్లైన్ ద్వారా 50 వేలు చెల్లించారు. 10న అనిల్‌కు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసిన వైద్యులు, మూడు రోజులపాటు ఐసీయూలో ఉంచారు. 13న ఐసీయూ నుంచి నేరుగా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన అనిల్ వారం పాటు బాగానే ఉన్నా.. శనివారం సాయంత్రం తిరిగి గుండె నొప్పి రావడంతో తిరిగి మెడికవర్ దవాఖానకు తీసుకొచ్చారు. దారి పొడవునా మృత్యువుతో పోరాడిన అనిల్, దవాఖానకు చేరుకోగానే ప్రాణాలు వదిలాడు.
దళితుడైన అనిల్ మృతిచెందిన విషయం తెలిసి దళిత, ప్రజా సంఘాల నాయకులు శనివారం రాత్రి నుంచే మెడికవర్ దవాఖాన ఎదుట ధర్నా చేశారు. ఆదివారం ఉదయం కూడా ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అనిల్ మృతి చెందాడని ఆరోపించారు. కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బోరున విలపించారు. అనిల్‌కు మూడేళ్ల కొడుకు, మూడు నెలల కూతురు ఉన్నారని, వీరి బతుకేంటని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేస్తామని చెప్పి అదనంగా 60 వేలు వసూలు చేశారని వాపోయారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత కనీసం ఐదు రోజులు ఐసీయూలో ఉంచాల్సి ఉన్నా మూడు రోజులకే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారని, కనీస అబ్జర్వేషన్ లేకపోవడం వల్లే అనిల్‌కు మరోసారి గుండె నొప్పి వచ్చిందని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఓవైపు దళిత సంఘాలు దవాఖాన ఎదుట ఆందోళన చేస్తుండగానే వెనుకవైపు నుంచి అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్టు తెలుస్తున్నది. ధర్నాలో బీఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుగు అక్కి బాలకిషన్, బీజేపీ నాయకులు రమేశ్, దళిత సంఘాల నాయకులు మార్వాడి సుదర్శన్, డీవైఎఫ్ఐ నాయకులు తిరుపతి, గోసంగి హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే ఎలాంటి ఆపరేషన్లనైనా ఎంప్యానల్ దవాఖానలు పైసా ఖర్చులేకుండా చేయాలి. కానీ, మెడికవర్ హాస్పిటల్ మాత్రం అనిల్ అడ్మిట్ అయిన తర్వాత పరీక్షల నిమిత్తం 10 వేలు, ఆ తర్వాత ఆరోగ్యశ్రీలో అప్రూవల్ అయిన తర్వాత నాణ్యమైన వైద్య సేవలు, పరికరాల పేరిట అదనంగా మరో 50 వేలు వసూలు చేశారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అంతే కాకుండా, దవాఖాన ఎంవోడీకి ఆన్లైన్లో డబ్బులు పంపించిన ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అంతేకాకుండా, శనివారం రాత్రి నుంచి హాస్పిటల్ వద్ద ఆందోళనలు జరుగుతున్నా ఇటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులుగానీ, అటు ఆరోగ్యశ్రీ అధికారులుగానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఈ ఘటనపై ఆరోగ్యశ్రీ అధికారులను వివరణ కోరగా.. దవాఖానలో అదనంగా డబ్బులు చెల్లించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే, రోగి బంధువులు తమ ఆరోగ్య మిత్ర దృష్టికి తేలేదని తెలిపారు. మెడికవర్ దవాఖానకు నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.