“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. పాడి పంటలనూ ఉయ్యాలో.. చల్లంగ చూడమ్మ ఉయ్యాలో.. ” అంటూ ఆడబిడ్డలు ఆడిపాడారు. ఆదివారం పెత్రమాస సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంగిలి పూల వేడుకను సంబురంగా జరుపుకొన్నారు. మహిళల ఆటపాటలతో పల్లె, పట్టణం హోరెత్తింది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆలయాలు, గ్రామాలు, కాలనీల కూడళ్లలో అందరూ ఒకచోట చేరి సందడి చేశారు.
నువ్వులు, బియ్యపు పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించి తామూ పంచుకున్నారు. ఈ సందర్భంగా హనుమకొండలోని వేయి స్తంభాల గుడితో పాటు పలు ఆలయాల్లో ఎంగిలి పూల సంబురం అంబరాన్నంటింది. వేడుకలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో అధికార యంత్రాంగం వీధి లైట్లు ఏర్పాట్లు చేయలేదు. దీంతో చాలా చోట్ల మహిళలు చీకట్లోనే బతుకమ్మ ఆడారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 21