Electric shock | ధర్మారం, సెప్టెంబర్21 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భూక్య మల్లేష్ నాయక్ (47) అనే రైతు తన పొలంలో పిట్టల బెదిరింపు కోసం ఆదివారం అల్యూమినియం రీల్ విద్యుత్ 11 కెవి వైర్లపై వేయగా అది ప్రమాదవశాత్తు పొలంలో పడడంతో షాక్ తగిలి మరణించాడు. దీంతో ఎంగిలిపూల బతుకమ్మ రోజున గ్రామంలో విషాదం ఏర్పడింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన మల్లేష్ నాయక్ గ్రామంలో అరకరం భూమి ఉండగా ఇంకా కొంత మంది రైతుల నుంచి కౌలుకు కూడా తీసుకొని వానకాలంలో వరి సాగు చేశాడు.
దీంతో పొలం కంకి పాలు పోసుకునే దశతో రైతు మల్లేశం నాయక్ అట్టి పొలంపై పిట్టలు వాలి పొలాన్ని నష్టం చేయకుండా ఉండడానికి అల్యూమినియం తో కూడిన రీల్స్ ను పట్టుకెళ్లాడు.అట్టి రీళ్లకు కరెంట్ షాక్ వస్తుందని విషయం రైతుకు అవగాహన లేదు. ఎత్తుగా ఉన్న విద్యుత్తు వైర్లపై అట్టి రీల్స్ వేస్తే అవి మెరిసి పిట్టలు పొలం వద్దకు రావని రైతు అనుకున్నాడు. దీంతో రైతు మల్లేష్ నాయక్ మధ్య పొలంలోనే నిలబడి చేతిలో రీల్స్ ఉండ పట్టుకొని దానికోసకు బండరాయి కట్టి విద్యుత్తు వైర్ల మీదికి విసిరి వేశాడు. దీంతో అట్టి రీల్ విద్యుత్ వైర్ల మీదుగా వచ్చి పొలంలో పడిపోయింది. దీంతో రైతు పొలం నీటిలో ఉండడంతో అట్టి రీల్ కు విద్యుత్ సరఫరా జరిగి షాక్ తగిలి మల్లేశం నాయక్ అక్కడికక్కడే మరణించాడు.
చుట్టుపక్కల రైతులు చూడడంతో అప్పటికి రైతు మరణించి ఉన్నాడు. మృతుడికి భార్య సునీత ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. పొలంలో మరణించినట్లు భర్త మరణ వార్త తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లిన మృతుని భార్య, కుమారుడు కన్నీరు మున్నీరైనారు. పొలం వద్దకు వెళ్లి కొన్ని నిమిషాలలోనే మల్లేష్ నాయక్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతు మరణానికి గల కారణాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం రైతు మృతదేహాన్ని కరీంనగర్ లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు.