హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రికి తాను ఇచ్చిన 16 పేజీల విన్నపం చెత్తబుట్ట పాలైందని మాజీ డీఎస్పీ నళిని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఒక అధికారిగా, ఉద్యమకారిణిగా ఆ విషయం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. ఆదివారం తన ఫేస్బుక్ అకౌంట్లో ప్రజలకు వీలునామా పేరిట బహిరంగ లేఖ రాశారు. ఒక అధికారి, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్యసేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన తన జీవితం ముగియబోతున్నదని లేఖలో పేర్కొన్నారు. ‘నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్‌గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుంచి నిద్ర లేదు. 8 ఏండ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆైర్థ్రెటిస్ అనే కీళ్ల జబ్బుకు తోడు రెంప నెలలుగా టైఫాయిడ్, డెంగీ, చికున్ గున్యాతో తీవ్రస్థాయికి చేరా’ అని చెప్పారు. చికిత్స కోసం డబ్బు కూడా లేదని తెలిపారు. మందుల సైడ్ ఎఫెక్ట్స్‌తో తన పరిస్థితి ప్రమాద స్థాయికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బళ్లెన్ని కసి తీరా దింపింది. మహర్షి దయానందుని దయవల్ల ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని, అందులో విశేషమైన కృషి చేస్తూ.. యజ్ఞ బ్రహ్మగా వేద యజ్ఞ పరిరక్షణ సమితి (వీవైపీఎస్) సంస్థాపకురాలుగా ఎదిగి, హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని, నా దారిని రహదారిగా పూల బాటగా మలచుకున్నాను. నళిని మళ్లీ వికసించింది’ అని చెప్పారు.
ప్రభుత్వం తన సమస్యలను, విజ్ఞప్తులను పట్టించుకోవడంలేదని నళిని బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు. ‘నేటి ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్‌పై విచారణ చేయించి ఇన్నేండ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలవెన్స్ లెక కట్టి (సుమారు రూ.2 కోట్లు) ఇవ్వండి అని అడుగుతూ.. 16 పేజీల రిపోర్ట్‌ను ఇచ్చాను. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుకుంటే చెత్త బుట్ట పాలైంది అని తెలిసింది. మరోసారి కాపీ పంపాను. ఇప్పటి వరకు స్పందన లేదు’ అని ఆవేదన చెందారు. ‘మీడియా మిత్రులకు విజ్ఞప్తి నేను చనిపోతే సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ అని రాయండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంసారం వైదికంగా జరగాలి. నేను చనిపోయాక వచ్చే పోస్టుమస్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి.. బతుకుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు’ అని సూచన చేశారు.
‘నా దయనీయ స్థితి కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే, నాకు సరైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతాను. ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ఉంది. ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు. నా పేరుపై ఉన్న ఒకగానొక ఇంటి స్థలం వీవైపీఎస్కు చెందుతుంది. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను. నా మనోభావాలను పంచుకొనే చకని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్‌బుక్‌కు ధన్యవాదాలు. సెలవిక మిత్రులారా’ అంటూ మాజీ డీఎస్పీ నళిని పేర్కొన్నారు. నళిని బహిరంగ లేఖ తెలంగాణ వ్యాప్తంగా, రాజకీయవర్గాల్లో, సామాజికమాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.