హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయల పండితులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ అంటేనే మతసామరస్యానికి ప్రతీక అని చెప్పారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ హత్య అత్యంత విచారకరమన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పోలీసులకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
అధికార పార్టీ నేతలు పారిశ్రామిక వేత్తలను గన్లతో బెదిరిస్తున్నారని విమర్శించారు. మంత్రి కూతురు ఆరోపణలపై సిట్టింగ్ జడ్జిత్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకపోతే మంత్రి ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను గుండా రాజ్యంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడి దారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్కార్పేట్తో స్వాగతం పలికిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందని ధ్వజమెత్తారు. పెట్టుబడిదారుల వద్ద అక్రమ వసూళ్లు చేసి పంచుకోవడంలో తేడాలొచ్చి తన్నుకు చస్తున్నారని విమర్శించారు. పెట్టుబడిదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తాము అగ్రికల్చర్ పెంచితే, వాళ్లు గన్ కల్చర్‌ను పెంచుతున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఉన్న తేడా అదేనని చెప్పారు.
Live: భాగ్యలక్షి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/DAuAP8syJm
— BRS Party (@BRSparty) October 20, 2025