Diwali | ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. మెకానిక్లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్జీజన్స్, కేడర్లలోని ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని తెలిపింది. పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు, చార్జెస్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పిస్తామని పేర్కొంది.
గతంలో ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నప్పుడు కూడా ప్రమోషన్లకు ఇదేవిధానం అనుసరించారు. అయితే 2020లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి ఇతర శాఖల ఉద్యోగుల నిబంధనలను వీరికి అమలు చేశారు. వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.