హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఉదంతం బయటకు రావడంతో ‘ముఖ్యనేత’ కనుసన్నల్లో నడుస్తున్న షాడో సీఎంవో (Shadow CMO) బాగోతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ముఖ్యనేత కనుసన్నల్లో నడుస్తున్న షాడో సీఎంవో, దానిలోని నలుగురు సభ్యులు, వారి అరాచకాలు, అవినీతి వ్యవహారం గాంధీభవన్, సచివాలయం, రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శాఖలను పంచుకొని మరీ వారు సాగిస్తున్న అవినీతి దమనకాండపై కథలు కథలుగా చర్చించుకుంటున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు ‘ముఖ్యనేత’ ఆదేశాలతో రూ.వందలు, వేల కోట్ల సెటిల్మెంట్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నలుగురు చేస్తున్న అవినీతిలో ఓఎస్డీ సుమంత్ ఇసుక రవ్వంత అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
రోడ్ నంబర్ 14లో ఆఫీస్
ముఖ్యనేతకు సన్నిహితులుగా పేరున్న ఆ నలుగురు కలిసి ప్రభుత్వంలోని సీఎంవో కార్యాలయానికి ధీటుగా సమాంతర వ్యవస్థను నడిపిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వీరంతా కలిసి ఏకంగా షాడో సీఎంవో ఆఫీసునే ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో కార్పొరేట్ స్థాయిలో ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి షాడో సీఎంవోను నడిపిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇది అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పుకొంటున్నారు. సీఎంవోలో జరగని పనులను ఇక్కడికి బదిలీ చేస్తున్నట్టు సమాచారం. వాటిని ఆ నలుగురు చక్కబెడుతున్నట్టు రాజకీయ నేత లు, కాంట్రాక్టర్లలో చర్చ జరుగుతున్నది. పెద్ద పెద్ద పనులుంటే మరెక్కడికీ వెళ్లకుండా నేరుగా షాడో సీఎంవో ఆఫీస్‌కు వెళ్తే సరిపోతుందని అంటున్నారు.
అక్కడ ‘డీల్’ ఓకే అయితే జరగ ని పనంటూ ఏదీ ఉండదన్న మాట వినిపిస్తున్న ది. పైగా వారు చిన్నా చితక పనులను పట్టించుకోవడం లేదని, కనీసం రూ. వంద కోట్ల డీల్ లేనిదే ఆ కేసు ముట్టుకోరని చెప్తున్నారు. ప్రభుత్వంలోని కొందరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ కార్యాలయానికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. గుమాస్తా ల మాదిరిగా కొందరు అధికారులు షాడో సీఎంవోకు తరచూ వస్తుంటారని తెలిసింది. భారీ భూ కుంభకోణాలు, బిల్లుల సెటిల్మెంట్స్కు సంబంధించి ఆ అధికారులు తమ అనుభవాన్నంతా రంగరించి షాడో సీఎంవోకు సలహాలు, సూచనలిస్తూ సహకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇందుకుగానూ ఆ అధికారులకు ఆర్థికంగా, ఇటు కీలకమైన పోస్టులు ప్రతిఫలంగా దక్కుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
శాఖలను పంచుకొని మరీ అరాచకం
సాధారణంగా సీఎంవోలో ఐఏఎస్ అధికారులకు శాఖలను కేటాయించినట్టు, షాడో సీఎంవోలో ఆ నలుగురు కూడా శాఖలను పంచుకున్నారని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వసూళ్లు, సెటిల్మెంట్లలో ఎవరికి పట్టున్న అంశాలను వారు ఎంచుకున్నారట! ముఖ్యనేతకు ‘నీడ’లా భావించే ఒక నేత విద్యాశాఖ వ్యవహారాలతోపాటు ఇసుక దందాను చూసుకుంటున్నట్టుగా తెలిసింది. ఇక ముఖ్యనేత ఎప్పుడు విదేశాలకు వెళ్లినా, పక్క రాష్ర్టాలకు వెళ్లినా పక్కనే ఉండే నగరానికి చెందిన మరో కీలక నేత సినీ పరిశ్రమ, ఫార్మారంగం, మైనింగ్, సిమెంట్ రంగాల్లోని అంశాలను చూసుకుంటున్నట్టు సమాచారం. ఇటీవల సినీపరిశ్రమకు సంబంధించిన పలు వివాదాలను ఆయనే దగ్గరుండి సెటిల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కీలకమైన భూమికి సంబంధించిన వివాదాలు, అంశాలకు సంబంధించి ముఖ్యనేతకు షాడోగా భావించే వ్యక్తి మొదటి రేస్‌లో ఉన్నారట! ముఖ్యనేత ఆదేశాలతో పెద్ద పెద్ద భూదందాలను చక్కదిద్దేందుకు ఆయనే రంగంలోకి దిగుతారనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యనేత ఆయనకు ఎమ్మెల్సీ బహుమతిగా ఇవ్వాలని ప్రయత్నించినా అది బెడిసికొట్టిందనే చర్చ జరుగుతున్నది.
ఇక సీఎంవోకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నట్టుగానే షాడో సీఎంవోకు సైతం అన్ని విభాగాలను సమన్వయం చేసుకునే మరో వ్యక్తి ఉండటం గమనార్హం. ముఖ్యనేతకు ఎప్పుడూ వెన్నంటే ఉంటూ ‘జై’ కొట్టే మరో కీలక వ్యక్తి ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్నట్టు చర్చించుకుంటున్నారు. ఏ శాఖ వ్యవహారమైనా ఆయన దృష్టికి వెళ్లిన తర్వాతే ముఖ్యనేతకు చేరుతుందనే చర్చ జరుగుతున్నది. ఈ విధంగా ఆ నలుగురు షాడో సీఎంవోను ఏర్పాటు చేసి శాఖలను పంచుకొని మరీ అవినీతి, అరాచకాలను సృష్టిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో శ్రద్ధ, దూకుడు చూపించిన ప్రభుత్వం, ఆ నలుగురి ఎల్లలు దాటిన అవినీతిపై ఎందుకు చూపడం లేదని? వారిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సుమంత్ వ్యవహారంలో రోహిన్‌రెడ్డి మీద ప్రత్యక్ష ఆరోపణలున్నాయని, ఆయన ఆఫీస్‌లోనే తతంగం మొత్తం జరిగిందని చెప్తున్నారని, మరి కనీసం రోహిన్‌రెడ్డి మీద అయినా ఎందుకు విచారణ జరగడం లేదని ప్రశ్నిస్తున్నారు.