సిద్దిపేట/చిన్నకోడూర్, డిసెంబర్ 7 : ‘రేవంత్‌రెడ్డీ (Revanth Reddy).. అబద్ధాలు ఆడటం.. చిల్లర మాటలు మాట్లాడటం మానుకో.. కాళేశ్వరం (Kaleshwaram) కూలింది.. కేసీఆర్, హరీశ్‌ను బండకేసి కొట్టాలని మాట్లాడుతున్నవ్.. నువ్వు సిద్దిపేటకు వస్తే బండకట్టి రంగనాయకసాగర్‌లో (Ranganayaka Sagar) ఎత్తేస్త.. మునుగుతవో తేలుతవో చూద్దాం.. రంగనాయకసాగర్ నీళ్లలో నువ్వు మునిగితే కాళేశ్వరం ఉన్నట్టు.. తేలితే కాళేశ్వరం కూలినట్టు’ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)తీవ్రంగా మండిపడ్డారు. పదేపదే కేసీఆర్‌ను, హరీశ్‌ను, కేటీఆర్‌ను తిట్టడం తప్ప రెండేండ్లలో రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని, కాంగ్రెస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం కారణంగా గ్రామాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో మొకజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి తమది రైతు ప్రభుత్వం అని డబ్బా కొట్టుకుంటున్నాడని, ఉత్తమ్ కుమార్‌రెడ్డి రెండు రోజుల్లో డబ్బులు వేస్తామని పదేపదే చెప్తున్నాడనీ, కానీ 50 రోజులు గడిచినా మక్క రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా మక్కరైతులకు బకాయిపడ్డ రూ.450 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
యాసంగి పంట పెట్టుబడి కోసం రైతులు మద్దతు ధర కన్నా తకువకే పంటలను విక్రయించి నష్టపోతున్నారని హరీశ్ వాపోయారు. రైతుభరోసా ఇవ్వకపోవడంతో రైతులు పెట్టుబడులకు తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 18 ఏండ్లు పైబడిన మహిళలందరికీ కేసీఆర్ హయాంలో ఏటా బతుకమ్మ చీరలు అందించారని, రేవంత్‌రెడ్డి ఒకసారి, అదీ స్థానిక ఎన్నికల ముందు కేవలం ఎస్‌హెచ్‌జీ మహిళలకు చీరలిచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఓటు అడగాలంటే మహిళలకు బకాయిపడ్డ మహాలక్ష్మి డబ్బులు రూ.60 వేల కోట్లు ఇచ్చి అడగాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతులకు బోనస్ పడాలి అంటే కాంగ్రెస్‌ను ఓడించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి పంట వేస్తేనే రైతుభరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారని, దీన్ని బట్టి చూస్తుంటే రైతుభరోసాకు ప్రభుత్వం కోతలు పెడుతున్నట్టు స్పష్టమవుతున్నదని చెప్పారు. నేటికీ రైతులకు పూర్తిస్థాయిలో పంట రుణమాఫీ కాలేదని తెలిపారు. హరీశ్ వెంట బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, బీఆర్ఎస్ నాయకులు కాముని శ్రీనివాస్, సదానంద గౌడ్, కనకరాజు, కూర మాణిక్య రెడ్డి, పాపయ్య, పోచబోయిన శ్రీహరి యాదవ్, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, ఉమేశ్‌చంద్ర, ఇట్టబోయిన శ్రీనివాస్, కాల్వ ఎల్లయ్య ఉన్నారు.