రాయ్పూర్: ‘ఆత్మహత్య చేసుకుని చనిపోతా’ అంటూ తరచూ భర్తను భార్య బెదిరించడం, మతం మారమని అతడిని ఒత్తడి చేయడం మానసిక క్రూరత్వమే అవుతుందని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కారణాలతో భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ బలోడ్ జిల్లాలోని ఒక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. విడాకుల మంజూరుపై కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం విచారించిన బెంచ్ క్రూరత్వం కేవలం భౌతిక హింస వరకే పరిమితం కాదని, భాగస్వామి మనసులో సహేతుకమైన భయాన్ని కలిగించే ప్రవర్తన కూడా హింస కిందకే వస్తుందని తెలిపింది. ఈ కేసులో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ భార్య తరచూ భర్తను బెదిరించడమే కాక, ఒకసారి విషం తీసుకోవడానికి, కత్తితో పొడుచుకోవడానికి, మరోసారి కిరోసిన్ పోసి నిప్పంటించుకోవడానికి ప్రయత్నించిందని, ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి తెచ్చిందని బెంచ్ ప్రస్తావించింది. అటువంటి ప్రవర్తన మానసిక క్రూరత్వం కిందకు వస్తుందన్న కింది కోర్టు తీర్పును సమర్థించింది.