గుంట భూమినైనా వదలకుండా రియల్టీ దందాకు మళ్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు పల్లెల్లోని భూములపై పంజా విసురుతున్నది. రాష్ట్రంలోని 12 వేల పంచాయతీల్లో గ్రామ కంఠం భూమిని అమ్మకానికి పెట్టింది. గుండుగుత్తగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా 30 ఏండ్లపాటు ఆ భూములను ప్రైవేటుకు ధారాదత్తం చేయనున్నది. దీని కోసం ‘హరిత సౌభాగ్యం’ అంటూ ఒక ముసుగు ప్రాజెక్టును చేపట్టింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు లేని సమయంలో.. గుట్టుచప్పుడు కాకుండా గ‘లీజు’ దందాకు తెరలేపింది. గ్రామ పంచాయతీల తీర్మానాన్ని పక్కదారి పట్టించి.. గంపగుత్తగా ప్రైవేటుకు భూములను అప్పగిస్తున్నది.
వరంగల్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): తెలంగాణలోని దాదాపు 12 వేల గ్రామ పంచాయతీలకు (Grama Panchayathi) చెందిన నిర్ణీత భూములను 30 ఏండ్లపాటు ఢిల్లీలోని ఐవోఆర్ఏ (అయోరా) ఎకోలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడానికి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు హరిత సౌభాగ్యం (తెలంగాణ) పేరిట ఒక ప్రాజెక్టును తీసుకొచ్చింది. దీనిని హరితావరణాన్ని పెంచేందుకు చేపట్టిన పథకమని ప్రభుత్వం చెప్తున్నది. అయితే, వాస్తవానికి అది పథకం కాదని, ఐవోఆర్ఏ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు అని గ్రామసభల ద్వారా తెలియవచ్చింది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మెమో పీఆర్అండ్ఆర్డీ 1/2175 (పీ) తేదీ 20-08-2024, ఆగస్టు 29, 2024 పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ.. ఐవోఆర్ఏ ఎకోలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది.
ఆ ఒప్పందం ప్రకారం లెటర్ నంబర్ 60/ఆర్డీ/ఈజీఎస్/ప్లాంట్/కార్బన్ క్రెడిట్/2024.. తేదీ 26-04-2025 నుంచి రంగంలోకి దిగింది. హరిత సౌభాగ్యం (తెలంగాణ) ప్రాజెక్టులో పాల్గొనడానికి గ్రామసభలు నిర్వహించి సమ్మతి పత్రాలను ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణావృద్ధి శాఖ ఈ నెల 8న అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేసింది. హరిత సౌభాగ్యం ప్రాజెక్టులో భాగంగా పంచాయతీల పరిధిలోని నిర్ణీత స్థలాల్లో హరిత వనాలను అంటే చెట్లను పెంచడానికి 30 ఏండ్లపాటు ఐవోఆర్ఏ సంస్థకు పూర్తి అధికారాలు ఉంటాయి. అంటే గ్రామ పంచాయతీల్లోని సదరు భూములపై ఐవోఆర్ఏ సంస్థకు సర్వాధికారాలు లభిస్తాయి. ఈ అధికారాలు సదరు సంస్థకు లభించాలంటే ఒప్పందానికి సుముఖమేనంటూ గ్రామసభల్లో స్వచ్ఛందంగా తీర్మానం చేసి పంపించాలి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు వెంటనే తీర్మానాలు చేసి, గ్రామసభ పూర్తి అంగీకారంతో అప్పగిస్తున్నట్టు నిరభ్యంతర పత్రాలను (ఎన్వోసీ) పంపించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఏమిటీ ఐవోఆర్ఏ? ఏం చేస్తుంది?
వాతావరణంలోకి గ్రీన్‌హౌజ్ వాయువులను విడుదల చేసే పరిశ్రమలు.. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి పర్యావరణానికి మేలు చేసే చర్యలను చేపట్టాలి. అంటే పెద్దఎత్తున చెట్లను పెంచాలి. లేకపోతే భారీఎత్తున జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, పెద్ద కంపెనీలు ప్రత్యక్షంగా చెట్ల పెంపకం వంటి పనులను చేయలేవు. దీంతో పరోక్షంగా ఈ కార్యక్రమాలను వేరే కంపెనీల ద్వారా చేయిస్తాయి. లేదా చెట్లను పెంచిన మిడిల్ కంపెనీలకు అందుకు అవసరమైన మొత్తాన్ని చెల్లిస్తాయి. తద్వారా పరోక్షంగా చెట్లను తామే పెంచినట్టు చెప్తాయి. ఇందులో భాగంగా మిడిల్ కంపెనీల నుంచి కొనుగోలు చేసే పత్రాలనే కార్బన్ క్రెడిట్స్‌గా (పెంచిన చెట్లు) పిలుస్తారు. ఢిల్లీలోని ఐవోఆర్ఏ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకు ఈ కార్బన్ క్రెడిట్స్‌ను విక్రయిస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోని పల్లెల్లో ఉన్న భూముల్లో హరిత వనాల పేరిట చెట్లను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐవోఆర్ఏ కంపెనీకి ప్రాథమికంగా అధికారాలు (కార్బన్ హక్కులు) ఇచ్చింది. మన గ్రామాల్లోని భూముల్లో చెట్లను పెంచిన ఐవోఆర్ఏ సంస్థ.. ఆ చెట్ల పెంపకం ద్వారా వచ్చే కార్బన్ క్రెడిట్స్‌ను పరిశ్రమలకు విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకొంటుందన్న మాట.
తెలంగాణలో అవసరమేంటి?
తెలంగాణలోని పల్లెల్లో చెట్లను పెంచితే మనకు స్వచ్ఛమైన వాతావరణం లభిస్తుంది కదా! అని కొందరు అనుకోవచ్చు. అయితే, ప్రస్తుతం పల్లెల్లో పచ్చని వాతావరణానికి కొదువలేదు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హరితహారం’ పథకం వల్ల 8 ఏండ్ల వ్యవధిలోనే రాష్ట్రంలో పచ్చదనం 6.67% మేర పెరిగింది. 2015లో 19,854 చదరపు కిలోమీటర్లుగా ఉన్న అటవీ విస్తీర్ణం 2023 నాటికి 21,179 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇప్పుడు ‘హరిత సౌభాగ్యం’ వంటి ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చెట్ల పెంపకాన్ని చేపట్టాల్సిన అవసరమే లేదు. అయినప్పటికీ, ప్రభుత్వం పల్లెల్లోని భూములను ఓ ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టాలనుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమానాలెన్నో..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేల గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన భూములను రేవంత్ ప్రభుత్వం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకు ఎందుకు అప్పగిస్తున్నది? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగితే ఆ డీల్ పత్రాలను ఇరువర్గాలు చర్చించుకొని ఉమ్మడిగా రూపొందిస్తాయి. అయితే, తెలంగాణ పల్లెల్లోని భూములను తమకు అప్పజెప్పే కార్బన్ క్రెడిట్స్ ఒప్పందాన్ని ఐవోఆర్ఏనే రూపొందించినట్టు సమాచారం. గ్రామసభల్లో తీర్మానాలకు సంబంధించి గ్రామసభ మీటింగ్ మినిట్స్, సభకు హాజరైన సభ్యుల వివరాలు, డాక్యుమెంట్లు, తీర్మానంపై గ్రామ కార్యదర్శి, సాక్షుల సంతకాలు, వార్డు సభ్యులు, సమావేశంలో పాల్గొన్న వారి సంతకాలు, ఎన్వోసీపై పంచాయతీ కార్యదర్శి సంతకం, పంచాయతీకి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి? తదితర వివరాలతో సర్వే నంబర్లు తీసుకోవాలని సదరు సంస్థనే పత్రాల్లో పొందుపరిచింది.
ఈ ఒప్పందాల రూపకల్పనలో గ్రామ పంచాయతీ పాత్ర ఏమీలేదని స్పష్టమవుతున్నది. ‘ఐవోఆర్ఏకు కార్బన్ హక్కుల కేటాయింపును, హరిత సౌభాగ్యం (తెలంగాణ) ప్రాజెక్టులో గ్రామ భాగస్వామ్యాన్ని ఆమోదిస్తున్నాం. గ్రామ పంచాయతీ భూముల్లో తోటల పెంపకం, సహజ పునరుత్పత్తి, పర్యవేక్షణ, ధ్రువీకరణ, ఇతర ప్రాజెక్టు సంబంధిత కార్యకలాపాలు నిర్వహించడానికి ఐవోఆర్ఏకు అనుమతి ఇస్తున్నాం. ఈ భూములపై ‘30 ఏండ్ల ప్రాజెక్టు కాలానికి కార్బన్ హక్కులను ఐవోఆర్ఏకు అప్పగిస్తున్నాం’ అని గ్రామసభ ఆమోదంతో ఎన్వోసీ (నిరభ్యంతర పత్రాలు)లు జారీ అవుతున్నాయి. వాటిమీద గ్రామ కార్యదర్శి, ఇద్దరు సాక్షుల సంతకాలు విధిగా ఉండేలా ఐవోఆర్ఏ జాగ్రత్త పడుతున్నది. భవిష్యత్‌లో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లను సదరు సంస్థ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
అలాగే, గ్రామసభలో చర్చించడానికి తగినంత సమయం ఇచ్చారని, తాము ముందస్తు సమ్మతి (కన్సెంట్)ని స్వచ్ఛందంగా ఇచ్చామని గ్రామసభలో పాల్గొన్నవారి పేర్లు, సంతకాలు చేస్తున్నట్టు సంస్థ పక్కాగా ఫార్మాట్లో పొందుపరచడం గమనార్హం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కార్బన్ క్రెడిట్స్‌ను విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంలో భూములిచ్చిన పంచాయతీలకు వాటాను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఒప్పందంలో ఎక్కడ కూడా ఈ షేర్ విషయం, ఎంత చెల్లించాలన్న కీలక వివరాలు పొందుపరచలేదని తెలుస్తున్నది. కమ్యూనిటీ అవసరాలకు ప్రైవేట్ సంస్థ ఎంతమేర చెల్లిస్తుందన్నది తేలలేదని గ్రామసభలో పాల్గొన్న సభ్యుడు ఒకరు తెలిపారు. అన్నింటికీ మించి ప్రస్తుతం గ్రామ పంచాయతీల పాలక మండళ్లు అధికారంలో లేని సమయంలో, గ్రామ ప్రజలకు కనీస అవగాహన కలిగించకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, హడావుడిగా గ్రామసభలను నిర్వహించడం.. పంచాయతీలు తమ భూములపై హక్కులు కోల్పోవడమే అవుతుందని, పంచాయతీరాజ్ సంస్థలను నిర్వీర్యం చేసినట్టేనని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ప్రైవేట్ కంపెనీకి లాభాల పంట
తెలంగాణ పల్లెల భూములపై 30 ఏండ్లపాటు అధికారాలు పొందుతున్న సదరు ప్రైవేట్ కంపెనీ రూ.6 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు లాభాలు ఆర్జిస్తుందని, ఆ మేరకు తెలంగాణ పల్లెలు నష్టపోతాయని హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. వారి అంచనా ప్రకారం.. ఒక గ్రామ పంచాయతీలో ఒక ఎకరాన్ని ఐవోఆర్ఏ కంపెనీకి అప్పగిస్తే, ఆ స్థలంలో ఆ సంస్థ 4 వేల చెట్లను పెంచగలదు. కొన్ని కారణాల వల్ల వాటిలో మూడు వేల చెట్లు మాత్రమే మిగిలాయనుకొంటే.. ఒక్కో చెట్టు 30 ఏండ్లలో 1 టన్ను కార్బన్ క్రెడిట్‌ను ఉత్పత్తి చేయగలదు. అలా మూడువేల చెట్లు మొత్తంగా మూడువేల కార్బన్ క్రెడిట్లను సృష్టించగలవు. బహిరంగ మార్కెట్లో ఒక్కో కార్బన్ క్రెడిట్ విలువ రూ.1,720 (20 డాలర్లు)గా ఉన్నది.
అంటే 3 వేల చెట్లు కలిపి మొత్తంగా రూ.51 లక్షల మేర సంపదను సృష్టించగలవు. తెలంగాణలోని మొత్తం 12 వేల పంచాయతీలను కలుపుకొంటే ఈ మొత్తం రూ.6,120 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. సదరు గ్రామ పంచాయతీల్లో ఒకటి కంటే ఎక్కువ ఎకరాల భూమిని తీసుకొన్నా.. చెట్ల నష్టం ఉండకపోయినా ఈ మొత్తం రూ.60 వేల కోట్ల వరకూ పెరుగొచ్చని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చర్యలతో పల్లెలకు రావాల్సిన వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రైవేటు కంపెనీకి చేరుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆఫ్రికా దేశాల కంటే హీనమా?నిజానికి కార్బన్ హక్కుల ప్రాజెక్టుల కోసం వెనుకబడిన ఉగాండా, రువాండా, కెన్యా, గబోన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి ఆఫ్రికా దేశాల్లోని మారుమూల కుగ్రామాల భూములను తీసుకొంటారు. అలాంటి ప్రాంతాల్లో భూమికి విలువ అనేది ఉండదు.
కంపెనీలు, మౌలిక వసతుల వంటి అభివృద్ధి ప్రాజెక్టులకు చోటు ఉండదు. అందుకే, అలాంటి ప్రాంతాలను ఎంచుకొంటారు. అయితే, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ భూముల విలువ ఆకాశానికి తాకింది. ఎకరం భూమి విలువ రూ.కోట్లకు చేరింది. నీటి వసతులు మెరుగవ్వడం, పరిశ్రమలు క్యూ కట్టడం, ఉపాధి అవకాశాలు పెరుగడంతో ఇదంతా జరిగింది. అలాంటి రూ.కోట్లు పలికే భూములను ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించడం, పైగా చెట్ల పెంపకంతో వచ్చే లాభాలపై సరైన వివరణ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఆఫ్రికా దేశాల కంటే తెలంగాణ హీనంగా కనిపిస్తున్నదా? అంటూ తెలంగాణవాదులు రేవంత్ సర్కార్‌పై మండిపడుతున్నారు. ఒకవేళ ఈ కార్యక్రమం నిజంగా మంచిదైతే ప్రచారం ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు.
నష్టాలు అన్నీఇన్నీ కావు
ఒక్కో గ్రామంలో ఒక్కో ఎకరం ద్వారా ప్రైవేట్ సంస్థ పొందే లాభం
ప్రైవేటుకు ఇస్తే ఏమవుతుంది?