కురవి, డిసెంబర్ 7 : ఓ మహిళ మూడు చోట్ల పోటీచేస్తున్నది. ఒకే గ్రామంలో సర్పంచ్ (Sarpanch Candidate), వార్డు స్థానానికి, మరో మండలంలో వార్డు స్థానానికి (Ward Member) నామినేషన్ వేసిన విచిత్ర ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. మహబూబాబాద్ మండలం మాధవాపురం శివారు తూర్పుతండా జీపీ పరిధిలోని చౌలతండాలో లావుడ్య నాగార్జున, లావుడ్య వినోదకు ఓటు హక్కు ఉన్నది. ఈ గ్రామానికి మొదటి విడతలో ఎన్నికలు జరుగుతుండగా, ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. దీంతో నాగార్జున సర్పంచ్ స్థానానికి, వినోద వార్డు సభ్యురాలిగా నామినేషన్ వేశారు. నాగార్జునకు టీవీ రిమోట్, వినోదకు గ్యాస్ పొయ్యి గుర్తులు కేటాయించారు. ఇదే నాగార్జున కుటుంబానికి కురవి మండలం కందికొండ శివారు బంజర తండాలో కూడా ఓట్లు ఉన్నాయి. 3వ విడతలో ఎన్నికలు జరుగుతున్న బంజర తం డాను ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయడంతో లావుడ్య వినోద సర్పంచ్‌గా, అదే గ్రామంలో ని 6వ వార్డుకు నామినేషన్ దాఖలు చేసింది.
స్క్రూటినీ అనంతరం నామినేషన్ల అర్హత జాబితాలో కూడా వినోద పేరు వచ్చింది. మహబూబాబాద్ మం డలం తూర్పుతండా, కురవి మండలం బంజరతండా కూడా కూతవేటు దూరంలో ఉండటం విశేషం. నూతన జీపీ బంజరతండాను ఏకగ్రీవం చేయాలని తండా పెద్దలు, వివిధ పార్టీల నాయకులు ప్రయత్నించారు. సర్పంచ్‌తోపాటు 6వ వార్డులో బరిలో ఉన్న లావుడ్య వినోద పోటీ నుంచి తప్పుకొనేందుకు ఒప్పుకోకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. పక్క మండలంలో తొలి విడతలో ప్రచారం చేస్తూనే మూడో విడతలోనూ బరిలో నిలవడం గమనార్హం. వినోద నామినేషన్ చెల్లకపోతే బంజరతండాలో బీఆర్ఎస్ ప్రతిపాదించిన బీ రజిత ఏకగ్రీమయ్యే అవకాశం ఉన్నది. ఈ విషయంపై ఫిర్యాదు చేయనున్నట్టు సమాచచారం.