హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు పారదర్శకంగా అందాల్సిన వైద్యం పక్కదారి పడుతున్నది. ప్రభుత్వం సరఫరా చేసే హార్ట్ స్టెంట్లు నాణ్యంగా ఉండవని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ బుకాయిస్తూ వసూళ్ల దందాకు తెరలేపాయి. జిల్లాలు మొదలుకొని హైదరాబాద్ వరకు ఈ దందా యధేచ్ఛగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 300కుపైగా నెట్వర్క్ దవాఖానలు ఉన్నాయి. వాటిలో రోగులెవరైనా ‘ఆరోగ్యశ్రీ’ కింద చికిత్స పొందితే సంబంధిత వివరాలను పూర్తి డాక్యుమెంట్లతో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఆ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ముందుగా ఆరోగ్యశ్రీ కింద రోగికి అవసరమైన చికిత్స చేసేందుకు ఆన్లైన్ ద్వారా అనుమతి పొందాలి. ఆ చికిత్స పూర్తయ్యాక పూర్తి వివరాలను ఆరోగ్యశ్రీ లాగిన్‌లో పొందుపర్చాలి. ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద మెరుగైన వైద్యం కోసం చాలా మంది హృద్రోగులు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న నెట్వర్క్ దవాఖానలు హార్ట్ స్టెంట్ల వ్యాపారానికి తెరలేపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దోపిడీని పట్టించుకోని సర్కారు
‘ఆరోగ్యశ్రీ’ పేరిట ప్రైవేట్ దవాఖానల్లో ఇంత భారీ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ దందాపై ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థ లేక, ఆరోగ్యమిత్రలు సైతం ప్రైవేట్ దవాఖానలతో కుమ్మక్కై ఈ దందాను దగ్గరుండి చక్కబెడుతున్నట్టు సమాచారం. రోగులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రైవేట్ దవాఖానలపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తాజా ఘటన ఇలా..
ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ స్టెంట్ వేయించుకునేందుకు హైదరాబాద్ హైటెక్‌సిటీలోని ఓ కార్పొరేట్ దవాఖానకు వచ్చారు. ‘మేడ్ ఇన్ అమెరికా’ స్టెంట్ల గురించి ఆ రోగికి, ఆమె బంధువులకు స్థానిక వైద్యుడు చెప్పాడు. తీరా హైటెక్‌సిటీ దవాఖానలో ‘మేడ్ ఇన్ అమెరికా’ స్టెంట్ రూ.50 వేలని, ఆ స్టెంట్‌కు ఎలాంటి బిల్లు ఇవ్వబోమని, ఆన్లైన్ పేమెంట్ కుదరదని చెప్పడంతో ఆమె విస్తుపోయారు. దీంతో అనుమానం వచ్చిన ఆ రోగి బంధువులు తమకు తెలిసిన వేరే వైద్యులను సంప్రదించారు. ‘అమెరికా స్టెంట్ వేస్తారో లేక ఆరోగ్యశ్రీ స్టెంట్ వేస్తారో మనకెలా తెలుస్తుంది’ అని వారు చెప్పడంతో ఆ రోగి వెనక్కు తగ్గారు.