బిచ్కుంద, అక్టోబర్ 13: తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ సునీత బండారి తమకొద్దు అంటూ బిచ్కుంద పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు పట్టుకొని ప్రిన్సిపాల్ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భోజనం విషయంలో ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తే తమను టార్గెట్ చేసి దుర్భాషలాడుతున్నారని వాపోయారు. ఆమె గత నెలలో ఇదే తరహాలో వ్యవహరిస్తే సబ్ కలెక్టర్ కిరణ్మయి పాఠశాలను సందర్శించి చెప్పినా ప్రిన్సిపాల్ తీరు మారడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌ను తొలగించే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సమస్యను ఉన్నతాధికారులకు చెప్పి పరిష్కరించుకోవాలని సూచించి పంపించారు.
విద్యార్థుల ఆందోళన చేస్తుండగా అటువైపు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గమనించి వారితో మాట్లాడి సమస్యను తెలుసుకొన్నారు. కాస్మొటిక్స్ ఇవ్వంలేదని, తరగతి గదిలోనే చదువుకోవడంతో పాటు అదే గదిలో నిద్రించడంతో ఇబ్బందులు పడుతున్నామని, కనీస వసతులు కూడా లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క గురుకుల పాఠశాల విద్యార్థి రోడ్ల పైకి వచ్చి ధర్నా చేయలేదని షిండే గుర్తుచేశారు. గురుకుల పాఠశాలలో ఏ ఒక్క సమస్య రాకుండా చూసుకున్నామన్నారు. అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలున్నా కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లిపోయారు